న్యూఢిల్లీ : భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. నిన్న చాతీలో సమస్య కారణంగా ఆయన ఆర్మీ రెఫరల్ ఆసుపత్రి లో చేరిన సంగతి తెలిసిందే.
రాష్ట్రపతి కోవింద్ ఆరోగ్య పరిస్థితిపై శనివారం ఆర్మీ ఆస్పత్రి ఒక హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. తదుపరి సాధారణ వైద్య పరీక్షల అనంతరం రామ్‌నాద్ కోవింద్‌ను ఢిల్లీలోని ఏయిమ్స్ ఆస్పత్రికి సిఫార్సు చేస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. అయితే శుక్రవారం రామ్‌నాథ్ కోవింద్ స్వల్ప అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.
ఛాతీలో అసౌకర్యంగా అనిపించడంతో ఆయనను వెంటనే ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కోవింద్ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. మరోవైపు తన ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ త్వరగా కోలుకోవాలని కోరిన వారందరికీ కృతజ్ఙతలు తెలియజేశారు.