టాలీవుడ్: 2019 లో విడుదలైన నాని ‘జెర్సీ’ సినిమా అద్భుతమైన విజయం సాధించింది. సినిమాలో అర్జున్ పాత్రలో నటించిన నాని అద్భుతమైన నటనతో సినిమాకి మంచి ఎమోషనల్ టచ్ ఇచ్చారు. గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఆద్యంతం నటీనటుల నటనతో పాటు ఎమోషనల్ సీన్స్ తో ఆకట్టుకుంటుంది. తనకి ఉన్న సమస్యని చెప్పకుండా తనకి ఇష్టమైన క్రికెట్ తప్ప వేరే ఏది చేయలేని పాత్రలో, ఒక రెస్పాన్సిబిలిటీ లేని భర్త గా, తన కొడుకుని బాగా ప్రేమించి కానీ తన కొడుకుకి ఏమీ చేయలేని తండ్రి గా నలిగిపోయే పాత్రలో నాని అద్భుతమైన నటనని కనబరిచారు. ఈ సినిమాలోని డైలాగ్స్, సంభాషణలు కూడా గుండెలు కదిలించేలా ఉంటాయి.
చాలా ఎమోషనల్ గా సాగే ఈ సినిమాకి చాలా మంది కనెక్ట్ అయ్యారు. ఎన్ని సార్లు చూసినా సినిమాలో వెంటనే లీనం అయ్యే లాగ ఉంటుంది ఈ సినిమా. అనిరుద్ రవిచందర్ అందించిన నేపధ్య సంగీతం ఈ సినిమాకి మరొక ప్రత్యేక ఆకర్షణ. ఈ సినిమాలోని డైలాగ్స్ కూడా కట్టిపడేస్తాయి. ఈ సినిమా బాలీవుడ్ లో ఇదే డైరెక్టర్ రీ-మేక్ చేయబోతున్నారు. షాహిద్ కపూర్ ఈ సినిమాలో నాని పాత్రలో నటించబోతున్నాడు. ఈ సినిమాకి ఇప్పటివరకు చాలా పురస్కారాలు అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా మరొక అరుదైన గౌరవాన్ని అందుకుంది. ఈ సినిమా ఇంటర్నేషనల్ ఇండియన్ టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శనకు ఎంపికైంది. ఈ విషయాన్ని సినిమా టీం ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.