వాయనాడ్: శనివారం వాయనాడ్‌కు ప్రధాని మోదీ!
కేరళలోని వాయనాడ్ జిల్లాలో సంభవించిన భయానక కొండచరియలు విరిగిపడి వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటన నేపథ్యంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఈ విపత్తు ప్రదేశాన్ని సందర్శించనున్నారు.
విపత్తు ప్రాంత సందర్శన:
ప్రకృతి కన్నెర్ర చేయడం అంటే ఏంటో కేరళలోని వాయనాడ్ జిల్లా ముండక్కై మరియు చురల్‌మల ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటం ద్వారా అందరికీ తెలిసింది.
ఈ విపత్తు సమయంలో సుమారు 500 మందికి ప్రాణహాని కలిగిందని అంచనా. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ దుర్ఘటన ప్రాంతాలను సందర్శించి, అక్కడి బాధితులను పరామర్శించడానికి ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి కన్నూర్ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఆ తర్వాత హెలికాప్టర్‌లో వాయనాడ్ చేరుకుని, అక్కడి విపత్తు ప్రాంతాన్ని సందర్శిస్తారు.
అపార ప్రాణనష్టం:
ముండక్కై మరియు చురల్‌మల ప్రాంతాల్లో సంభవించిన కొండచరియలు విరిగిపడి, అధికారిక లెక్కల ప్రకారం 224 మంది మరణించారు.
అయితే అనధికారిక లెక్కల ప్రకారం 414 మంది ప్రాణాలు కోల్పోయినట్లు భావిస్తున్నారు. ఈ విపత్తులో ఇంకా 154 మంది గల్లంతైనట్లు అంచనా. 88 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ప్రధాని సందర్శన:
విపత్తు ప్రాంతాన్ని సందర్శించిన తర్వాత, ప్రధాని నరేంద్ర మోదీ బాధితులు చికిత్స పొందుతున్న శిబిరాలను సందర్శించి వారి పరిస్థితిని తెలుసుకుంటారు.
ఈ సందర్భంగా బాధితులకు అవసరమైన సాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని ఆయన హామీ ఇవ్వనున్నారు.
పునరావాస చర్యలు:
వాయనాడ్ పునరావాసానికి సంబంధించిన డిమాండ్లను కేరళ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ముందు వుంచింది. ఇప్పటికే, మృతుల అంత్యక్రియలను రాష్ట్రప్రభుత్వమే నిర్వహించింది.
ప్రకృతి విపత్తు కారణంగా నష్టపోయిన ప్రజలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ, ప్రధాని నరేంద్ర మోదీ ఈ విపత్తు ప్రదేశాలను సందర్శించి బాధితుల పట్ల పరామర్శను తెలియజేయనున్నారు.
ఈ సందర్శన ద్వారా కేరళలోని వాయనాడ్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అదనపు సాయాన్ని ఏమన్నా ప్రకటిసుందన్న ఆశ అన్ని వర్గాలలోనూ కనిపిస్తోంది.