పృథ్వీ షా, తన అరంగేట్రంలోనే భారీ విజయాలు సాధించి, దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఆటగాడు. ఒకప్పుడు భారత క్రికెట్ భవిష్యత్తు సచిన్ టెండూల్కర్ తర్వాత అతడేనని భావించారు. స్కూల్ స్థాయి క్రికెట్‌లో 546 పరుగులు చేసి అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న షా, రంజీ ట్రోఫీ ద్వారా జాతీయ జట్టులోకి ప్రవేశించాడు.
అయితే, ఇటీవల అతని ప్రవర్తన, క్రమశిక్షణ విషయంలో తలెత్తిన సమస్యలు అతని ఆటపై ప్రభావం చూపుతున్నాయి. ముంబై రంజీ జట్టు నుంచి కూడా అతను తాజగా తప్పించబడ్డాడు. ఫిట్‌నెస్ లోపాలు, నెట్ సెషన్ లకు ఆలస్యంగా రావడం, ప్రాక్టీస్ పై నిర్లక్ష్యం ఇవన్నీ ఈ నిర్ణయానికి కారణంగా తెలుస్తున్నాయి. సీనియర్లు శ్రేయాస్ అయ్యర్, అజింక్యా రహానే వంటి ఆటగాళ్లతో పోలిస్తే అతని ప్రాక్టీస్ ప్రవర్తనలో పెద్ద తేడాలు ఉన్నాయంటూ కోచ్‌లు ఫిర్యాదు చేశారు.
అలాగే ఇటీవల జరిగిన రంజీ సీజన్‌లో బరోడా, మహారాష్ట్ర జట్లపై జరిగిన మ్యాచ్‌లలో నిరాశకరమైన ప్రదర్శన, అతని క్రికెట్ కెరీర్‌పై ప్రశ్నార్థక చిహ్నం మిగిల్చాయి. ఫిట్‌నెస్ సమస్యలు, క్రమశిక్షణ లోపం కారణంగా జట్టులో స్థానం కోల్పోవడం, భవిష్యత్తులో జాతీయ జట్టులోకి తిరిగి రావడానికి షా ముందు పెద్ద సవాలుగా మారింది. క్రికెట్ విశ్లేషకులు అతని కెరీర్ ప్రమాదంలో ఉందని హెచ్చరిస్తున్నారు.