టాలీవుడ్ నటుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ ఇటీవల సోషల్ మీడియాలో తీవ్ర ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు. సినిమా ఫంక్షన్‌లో వైసీపీని టార్గెట్ చేశారన్న ఆరోపణలతో ఆయనపై వైసీపీ శ్రేణులు విరుచుకుపడుతున్నాయి.
ఈ నేపథ్యంలో, బుధవారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి, తనను వేధిస్తున్న వారిపై ఫిర్యాదు చేశారు.
సోషల్ మీడియాలో తనకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతూ, ఫోన్ మెసేజ్‌ల ద్వారా వైసీపీ యాక్టివిస్టులు ఇబ్బంది పెడుతున్నారని పృథ్వీరాజ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసుల ద్వారా దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదే సమయంలో, ‘11 నెంబర్’ అంశంపై కూడా ఆయన వివరణ ఇచ్చారు. తాను క్రికెట్ మ్యాచ్ సందర్భంలో ఆ నెంబర్ చెప్పానని, వైసీపీని ఉద్దేశించి మాట్లాడలేదని స్పష్టం చేశారు.
తాజాగా, విశ్వక్ సేన్ నటించిన లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలతో వివాదం చెలరేగింది. ఆయన వ్యాఖ్యలపై వైసీపీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ట్రోలింగ్ మరింత పెరిగింది.
బీపీ సమస్యలతో ఆసుపత్రిలో చేరిన పృథ్వీరాజ్, అనంతరం నేరుగా సైబర్ క్రైమ్ పోలీసుల వద్దకు వచ్చి ఫిర్యాదు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.