తెలంగాణ: సంక్రాంతి పండుగ సమయంలో ప్రజలు సొంత ఊర్లకు వెళ్లేందుకు బస్సులు, రైళ్లపై అధికంగా ఆధారపడుతున్నారు.
ఈ రద్దీని అవకాశంగా మార్చుకున్న ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు టికెట్ ధరలను మూడు నుంచి నాలుగు రెట్లు పెంచి ప్రయాణికులను తీవ్రంగా దోపిడీ చేస్తున్నాయి.
హైదరాబాద్ నుంచి విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాలకు బస్సు టికెట్లు సామాన్యులకు అందని ధరలకు చేరుకున్నాయి.
సాధారణ రోజుల్లో రూ.2,000ల లోపే ఉన్న ఏసీ సీటర్ టికెట్ ధర ఇప్పుడు రూ.5,000లకు చేరింది. వోల్వో బస్సుల టికెట్ ధరలు ఏకంగా రూ.7,000లకు పైగా ఉన్నాయి.
ప్రత్యేక బస్సులు, రైళ్లను ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ ప్రయాణికుల రద్దీ తగ్గడం లేదు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు అధికారులు స్పందించి ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీని అడ్డుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ప్రస్తుతం అధిక ధరలు చెల్లించడమే తప్ప మరో మార్గం లేక ప్రజలు ప్రైవేట్ బస్సులను ఆశ్రయిస్తున్నారు.