హైదరాబాద్ : తెలంగాణ లో కరోనా చికిత్సకు సంబంధించి ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా ఆస్పత్రుల్లోని 50 శాతం పడకలను సర్కారు స్వాధీనం చేసుకోనుంది. ఇకపై ఆ ఆస్పత్రుల్లోని సగం పడకల్లో ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారమే కరోనా చికిత్సకు సంబంధించిన వైద్యసేవలు అందుతాయి.
ఆ 50% పడకలను రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖే నింపుతుంది. ఈ విషయంపై వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ గురువారం ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల యాజమాన్యాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ప్రతి ఆస్పత్రిలో 50% పడకలను ప్రభుత్వానికి ఇవ్వడానికి వారు అంగీకరించారని మంత్రి సమావేశం అనంతరం ఓ ప్రకటనలో తెలిపారు.
వైద్య, ఆరోగ్య శాఖ ఓ ప్రత్యేక యాప్ ద్వారా ప్రైవేట్ ఆస్పత్రులకు రోగులను పంపించేందుకు ప్రైవేట్, కార్పొ రేట్ ఆస్పత్రులు అంగీకరించాయని వెల్లడించారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలు రూపొందించేందుకు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాస్‌రావుతో శుక్రవారం భేటీ కావాలని ఆస్పత్రుల యాజమాన్యాలను మంత్రి కోరారు. సగం పడకలను సర్కారుకు ఇవ్వడానికి అంగీకరించిన ఆస్పత్రుల యాజమాన్యాలకు ఈటల కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ విడుదల చేసిన సమాచారం ప్రకారం రాష్ట్రంలో 118 ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో కరోనా చికిత్స కోసం 7,879 పడకలు కేటాయించారు. అందులో సగం అంటే 3,940 పడకలను ఇకపై ప్రభుత్వమే కేటాయించనుంది. మొత్తం పడకల్లో 3,216 రెగ్యులర్ బెడ్స్ ఉండగా, వాటిలో 1,608 పడకలను ప్రభుత్వం కేటాయిస్తుంది. ఇక ఆక్సిజన్ పడకలు 3,145 ఉండగా, 1,572 బెడ్స్‌ను సర్కారే నింపుతుంది. 1,518 ఐసీయూ పడకల్లో 759 బెడ్స్ ప్రభుత్వ ఆధీనంలోకి వస్తాయి.