వాయనాడ్ లోక్ సభ ఉప ఎన్నికల కోసం ఏఐసీసీ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ ఈరోజు నామినేషన్ దాఖలు చేయనున్నారు. గత లోక్ సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ వాయనాడ్‌తో పాటు రాయబరేలి నుండి గెలుపొందారు. రాయబరేలి ఎంపీగా కొనసాగాలని నిర్ణయించుకున్న రాహుల్, వాయనాడ్ ఎంపీ పదవికి రాజీనామా చేశారు.
దీంతో వాయనాడ్ లోక్ సభకు ఉప ఎన్నిక అనివార్యమైంది, ఇందులో ప్రియాంక గాంధీ పోటీ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటి సీఎం మల్లు భట్టి విక్రమార్క, కేసీ వేణుగోపాల్ సహా కాంగ్రెస్ ముఖ్యనాయకులు పాల్గొంటున్నారు.
ప్రియాంక గాంధీ నామినేషన్ పత్రాలు దాఖలు చేసేందుకు రాహుల్ గాంధీతో కలిసి ఢిల్లీ నుండి వాయనాడ్ చేరుకున్నారు.
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ట్విట్టర్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నా హృదయంలో వాయనాడ్ ప్రజలకు ప్రత్యేక స్థానం ఉంది. వారికి నా సోదరి ప్రియాంక కంటే మెరుగైన ప్రజా ప్రతినిధిని ఊహించలేను. ఆమె వాయనాడ్ ప్రజల తరపున పార్లమెంట్లో తన గళమెత్తుతుందని నాకు నమ్మకం ఉంది” అని పేర్కొన్నారు.