టాలీవుడ్: ఒక సినిమా అనగానే ముందుగా ఆలోచించేది కథ గురించి. ఒక కథ అని అనుకున్న తర్వాత ఆలా అనుకున్న కథని అనుకున్నట్టు అమలులోకి తెచ్చి స్క్రీన్ పైన సినిమా వేసే వరకు ప్రతీ అడుగులో నిర్మాత పాత్ర ఉంటుంది. కొందరు నిర్మాతలైతే కథా రచయితలకి ఇన్స్పిరేషన్ కోసం పీస్ ఫుల్ ప్రదేశాలకి వెళ్లి కథలు రాయమని కొన్ని డబ్బులు ఇచ్చి ఏర్పాట్లు కూడా చేస్తుంటారు. ఇలా సినిమా మొదలవకముందు నుండే సినిమా నిర్మాత అందులో భాగస్వామి అవుతాడు.
ప్రస్తుతం ఎన్నో కారణాల వలన నిర్మాత ఇబ్బంది పడుతున్నాడు. సినిమా మొదలు పెట్టగానే టెక్నికల్ డిఫరెన్సెస్ వచ్చి కొన్ని సార్లు హీరోలని, టెక్నిషియన్స్ ని, హీరోయిన్లని, కారెక్టర్ ఆర్టిస్టులని మార్చడం జరుగుతుంది. దాని ఆర్థిక భారం మోయాల్సింది నిర్మాతే. షూటింగ్ మధ్యలో ఏమైనా ఆక్సిడెంట్స్ జరిగి ఏమైనా ప్రమాదం జరిగితే సెట్ లో జరిగే నష్టానికి కాకుండా ఎవరికైనా ఏదైనా జరిగితే దాని నష్ట పరిహారం కూడా నిర్మాత ఖాతా లోకే వెళ్తుంది. సినిమా ఫినిషింగ్ స్టేజ్ లో ప్రివ్యూ వేసి ఎక్స్పర్ట్స్ ఎమన్నా సజెస్ట్ చేస్తే మళ్ళీ రీ-షూట్ భారం మోయాల్సింది నిర్మాతే.
ఒకప్పుడు నిర్మాత అంటే ఒక విలువ, గౌరవం ఉండేది. ఇపుడు నిర్మాత అంటే కేవలం డబ్బులు ఇవ్వడానికి తప్ప మిగతా ఏ అంశాల్లో కూడా నిర్మాతని పట్టించుకోకపోవడం చాలా సార్లు వింటుంటాం. కొందరు పెద్ద నిర్మాతలు, పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ తప్ప మిగతా నిర్మాతలకి అంత గుర్తింపు కూడా రాదు. ఇక సినిమా నిర్మాత పై పడుతున్న మరో భారం షేర్. పెద్ద హీరోలతో ఒక నిర్మాత సినిమా తియ్యాలంటే హీరో పారితోషకం తో పాటు వాటానో, లేదా ఎదో ఏరియా డిస్ట్రిబ్యూషన్ ఇవ్వాల్సిందే. సినిమా ఆడి డబ్బులు బాగా వస్తే పర్లేదు కానీ దాదాపు 10 శాతం మాత్రమే సక్సెస్ రేట్ ఉన్న ఇండస్ట్రీ లో సినిమా ఆడకపోతే డిస్ట్రిబ్యూటర్స్ కి , నమ్ముకున్న వాళ్లందరికీ సమాదానాలు, రిటర్న్ మనీ ఇచ్చి లాస్ అవ్వాల్సింది నిర్మాతనే. మరి అలాంటి సమయాల్లో పెద్ద హీరోలు నిర్మాతని ఆదుకున్న సందర్భాలు చాలా తక్కువే వింటుంటాం.