జాతీయం: కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై పంజాబ్ సీఎం మండిపాటు
అమెరికా నుంచి బహిష్కరణకు గురైన భారతీయులను తీసుకొచ్చే రెండు విమానాలు అమృత్‌సర్‌లో దిగనున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 15, 16 తేదీల్లో వచ్చే ఈ విమానాలను అమృత్‌సర్‌లోనే దించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మండిపడ్డారు.
రాష్ట్ర ప్రతిష్ఠను దిగజార్చేందుకే ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ‘‘119 మంది అక్రమ వలసదారుల్లో 67 మంది పంజాబ్‌కు చెందిన వారని.. అందుకే అమృత్‌సర్‌లో విమానం ల్యాండ్ చేస్తున్నామని వాళ్లు చెబుతున్నారు. అలా అయితే.. మొదట వచ్చిన విమానం అహ్మదాబాద్‌లో ఎందుకు దిగలేదు? కేవలం పంజాబ్ ప్రతిష్ఠను దిగజార్చాలని వాళ్లు (బీజేపీ నేతృత్వంలోని కేంద్రం) ప్రయత్నిస్తున్నారు’’ అని భగవంత్ మాన్ ఆరోపించారు.
‘డిపోర్టేషన్’ ఆపరేషన్‌లో భాగంగా ఫిబ్రవరి 5న 104 మంది భారతీయులతో కూడిన అమెరికా సైనిక విమానం అమృత్‌సర్‌కు చేరుకుంది. మరో 119 మందితో వచ్చే విమానం ఫిబ్రవరి 15న పంజాబ్‌లోనే దిగనుంది. ఫిబ్రవరి 16న మరో విమానం కూడా అక్కడికే రానుంది.
శనివారం వచ్చే 119 వలసదారుల్లో 69 పంజాబ్, 33 మంది హరియాణా, ఎనిమిది మంది గుజరాత్, యూపీకి చెందిన వారు ముగ్గురు, గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్‌కు చెందినవారు ఇద్దరు చొప్పున, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్‌కు చెందిన వారు ఒక్కొక్కరు ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.