షార్జా: ఈ ఐపీఎల్ సీజన్‌లో పంజాబ్‌ను చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం, అనుమానం కలుగుతుంది. ఆట మొదటి సగంలో ఏడు మ్యాచ్ లలో ఆరు ఓడిపోయిన జట్టు ఇప్పుడు వరుసగా విజయాలతో దూసుకెల్తోంది. అది కూడా వరుసగా! సోమవారం పంజాబ్ 8 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ఘన విజయం సాధించింది. మొదట కోల్‌కతా నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 149 పరుగులు చేసింది.
శుబ్‌మన్ గిల్ (45 బంతుల్లో 57; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), కెప్టెన్ మోర్గాన్ (25 బంతుల్లో 40; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. షమీ 3 వికెట్లు తీశాడు. తర్వాత పంజాబ్ 18.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసి గెలిచింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ క్రిస్ గేల్ (29 బంతుల్లో 51; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు వేగంతో ఆడగా, మన్‌దీప్ (56 బంతుల్లో 66 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) గెలిపించాడు.
పంజాబ్ లక్ష్యఛేదన ఫోర్‌తో మొదలైంది. కమిన్స్ తొలి బంతిని రాహుల్ బౌండరీకి తరలించాడు. జట్టు స్కోరు 47 పరుగుల వద్ద రాహుల్ (25 బంతుల్లో 28; 4 ఫోర్లు) ఔటయ్యాడు. దీంతో గేల్ క్రీజ్‌లోకి వచ్చాడు. వరుణ్ చక్రవర్తి, నరైన్ బౌలింగ్‌ల్లో భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. మరోవైపు ఓపెనర్ మన్‌దీప్ చూడచక్కని బౌండరీలతో నిలకడగా పరుగులు చేశాడు.
49 బంతుల్లో అర్ధసెంచరీ చేశాడు. జట్టు 13.4 ఓవర్లలో 100 పరుగులను అధిగమించింది. కాసేపటికే గేల్ 25 బంతుల్లోనే హాగ్ సెంచరీ పూర్తి చేశాడు. వీళ్లిద్దరు రెండో వికెట్‌కు సరిగ్గా 100 పరుగులు జత చేశాక గేల్ ఔటైనా, మిగతా లాంఛనాన్ని పూరన్ (2 నాటౌట్)తో కలిసి మన్‌దీప్ పూర్తి చేశాడు.