న్యూఢిల్లీ: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫ్రాంచైజీ ఈ సారి పేరు మార్చుకుని కొత్త పేరుతో బరిలోకి దిగనుంది. ప్రీతీ జింతా యొక్క కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రానున్న ఐపీఎల్ 2021 సీజన్‌కు కొత్త పేరుతో బరిలోకి దిగుతామని తెలిపింది. ఇక నుంచి తమ జట్టును పంజాబ్ కింగ్స్ పేరుతో మాత్రమే పిలవాలని, పేరులో మార్పును కోరుతూ ఇప్పటికే తాము బీసీసీఐకి దరఖాస్తు కూడా చేసామని ఫ్రాంచైజీ తెలిపింది.
ఐపీఎల్ (2008) ప్రారంభం నుంచి టోర్నీ బరిలో ఉన్న పంజాబ్ జట్టు ఇప్పటి వరకు ఒక్కసారీ టైటిల్ గెలవలేదు. ఈ నేపథ్యంలో వచ్చే ఐపీఎల్ 14వ సీజన్‌లో కొత్త పేరుతో టోర్నీ బరిలోకి దిగనున్న పంజాబ్ తలరాత మారుతుందేమో వేచి చూడాల్సిందే.
కేఎల్ రాహుల్ కెప్టెన్సీలోని కింగ్స్ పంజాబ్ గత ఏడాది సీజన్‌లో ఆరో స్థానంలో నిలిచింది. కెప్టెన్‌గా రాహుల్ 675 పరుగులతో టోర్నీలో టాప్ స్కోరర్‌గా నిలిచి ఆరెంజ్ క్యాప్ అందుకున్నప్పటికీ, మిగతా ఆటగాళ్లు ఎవరు అనుకున్న రీతిలో ఆడలేదు. ముఖ్యంగా రూ.10 కోట్లు పెట్టి కొన్న ఆసీస్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ కూడా తీవ్ర నిరాశపరిచాడు.
ఇదిలా ఉండగా ఫిబ్రవరి 18న జరగనున్న మినీ ఐపీఎల్ వేలానికి అంతా సిద్ధమైన వేళ పంజాబ్ జట్టు తమ దగ్గర ఉన్నా రూ.52 కోట్లతో వేలంలో పాల్గొననుంది. అయితే బీసీసీఐ సవరించిన తాజా నిబంధనల ప్రకారం పర్స్‌లో 75 శాతం ఆటగాళ్ల కొనుగోలుకు ఖర్చు చేయాల్సి ఉంటుందని తెలిపింది. దీంతో పంజాబ్ జట్టు రూ. 31.7 కోట్లతో వేలంలో పాల్గొనాల్సి ఉంది. గతేడాది పేలవ ప్రదర్శన కనబరిచిన మ్యాక్స్‌వెల్ సహా పలువురిని రిలీజ్ చేసింది పంజాబ్.