దుబాయ్: నిన్న జరిగిన మ్యాచ్ లో మరో అనూహ్య ఫలితం… గెలవాల్సిన స్థితిలో ఉండి కూడా హైదరాబాద్ జట్టు చేజేతులా ఓటమిని ఆహ్వానించింది. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 12 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 126 పరుగులు మాత్రమే చేయగలిగింది.
పంజాబ్ తరఫున నికోలస్ పూరన్ (28 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రషీద్ ఖాన్ (2/14) కింగ్స్ ఎలెవన్ బ్యాట్స్‌మెన్ పని పట్టగా, హోల్డర్, సందీప్ కూడా చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ 19.5 ఓవర్లలో 114 పరుగులకే ఆలౌటైంది. డేవిడ్ వార్నర్ (20 బంతుల్లో 35; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒక్కడే దూకుడుగా ఆడాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ క్రిస్ జోర్డాన్ (3/17)
తొలి బంతి నుంచి చివరి బంతి వరకు పంజాబ్ ఇన్నింగ్స్ పేలవంగా సాగింది. సన్‌రైజర్స్ కట్టుదిట్టమైన బౌలింగ్ ముందు జట్టు బ్యాట్స్‌మెన్ తేలిపోయారు. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (27 బంతుల్లో 27; 2 ఫోర్లు, 1 సిక్స్), మన్‌దీప్ సింగ్ (17) దూకుడుగా ఆడటంలో విఫలమయ్యారు. ఫలితంగా ఈ జోడి తొలి వికెట్‌కు 30 బంతుల్లో 37 పరుగులే జోడించగలిగింది. సందీప్ బౌలింగ్‌లో మన్‌దీప్ వెనుదిరగ్గా, పవర్‌ప్లేలో స్కోరు 47 పరుగులకు చేరింది. అయితే 66 పరుగుల వద్ద పంజాబ్‌కు అసలు దెబ్బ పడింది.
పంజాబ్ ఓపెనర్ మన్‌దీప్ భారమైన హృదయంతో మ్యాచ్ ఆడాడు. అతని తండ్రి శుక్రవారమే చనిపోయారు. అయితే స్వస్థలం కూడా వెళ్లలేని స్థితిలో మన్‌దీప్ కొనసాగాడు. ఈ నేపథ్యంలో పంజాబ్ ఆటగాళ్లు నల్లరంగు రిబ్బన్లు ధరించి బరిలోకి దిగారు. గత మ్యాచ్‌లో గాయపడిన మయాంక్ స్థానంలో మన్‌దీప్ జట్టులోకి వచ్చాడు.