మూవీడెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తున్నా, తాజాగా వివాదంలో చిక్కుకుంది.
ఈ చిత్రంలో ఫహద్ ఫాజిల్ పోషించిన బన్వర్ సింగ్ షెకావత్ పాత్ర క్షత్రియులను అవమానించిందని కర్ణిసేన ఆరోపణలు చేస్తోంది.
దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, కర్ణిసేన నాయకుడు రాజ్ షెకావత్ నిర్మాతలను హెచ్చరించారు.
రాజ్ షెకావత్ తాజాగా ఒక వీడియో విడుదల చేశారు. అందులో, “పుష్ప 2లో షెకావత్ పాత్రను హీనంగా చూపించడం క్షత్రియ సమాజాన్ని అవమానించడం తో సమానం.
ఈ పేరు వెంటనే సినిమా నుంచి తొలగించాలి. లేదంటే నిర్మాతలను ఇంటికి వచ్చి కొట్టేందుకు సిద్దంగా ఉంటాం” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కర్ణిసేన తెలిపినట్టు, సినిమా నుండి “షెకావత్” అనే పదాన్ని పదే పదే అవమానకరంగా ఉపయోగించారని, అది క్షత్రియుల ఆత్మగౌరవానికి మంటపెట్టేలా ఉందని ఆరోపించారు.
“వాక్ స్వాతంత్ర్యం పేరుతో క్షత్రియులను అవమానించడం ఆమోదయోగ్యం కాదు” అని రాజ్ షెకావత్ ధ్వజమెత్తారు.
ఈ ఆరోపణలపై సినిమా బృందం ఇంకా స్పందించలేదు. ఫహద్ ఫాజిల్ పోషించిన షెకావత్ పాత్ర నెగటివ్ షేడ్‌లో ఉన్నప్పటికీ, ఇది అంత తీవ్ర విమర్శలకు దారి తీస్తుందని చిత్ర యూనిట్ ఊహించలేదు.
ఈ వివాదం పుష్ప 2 విజయంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.