భారత్‌ను పుతిన్ మళ్ళీ ప్రశంసించారు – సహజ భాగస్వామ్యంపై సంతృప్తి
అంతర్జాతీయం: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్‌పై మరోసారి ప్రశంసలు కురిపించారు. భారత్ రష్యా సహజ భాగస్వామిగా ఉందని, ఇరు దేశాల మధ్య సంబంధాలు అన్ని రంగాలలో వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు. సోచిలోని వాల్డాయ్ సమావేశంలో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు, దీన్ని అధికారిక వార్తాసంస్థలు ధ్రువీకరించాయి.
“భారత్ ఓ గొప్ప దేశం. ఆ దేశంతో మేము సంబంధాలను అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నాం. భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతూ ప్రపంచంలోని అగ్రగామి దేశాల జాబితాలో చేరేందుకు అర్హత సాధిస్తోంది. భారత్ 7.4 శాతం వృద్ధిరేటును సాధిస్తున్న మహా ఆర్థిక వ్యవస్థ. భద్రత, రక్షణ రంగాలలో కూడా ఇరుదేశాల మధ్య సంబంధాలు బలపడుతున్నాయి. ప్రస్తుతం భారత్-రష్యా వాణిజ్యం సుమారు 60 బిలియన్ డాలర్లుగా ఉంది,” అని పుతిన్ వ్యాఖ్యానించారు.
ఇరు దేశాల భద్రతా సహకారానికి బ్రహ్మోస్ క్షిపణిని ఉదాహరణగా ప్రస్తావిస్తూ, ఇది భారత్-రష్యా విశ్వాసం, భవిష్యత్తులో భాగస్వామ్యానికి చిహ్నమని అన్నారు. ఉమ్మడి కరెన్సీపై ఇప్పుడే ఆలోచనలు ఏమీ లేవని స్పష్టం చేశారు. అలాగే, భారత స్వాతంత్ర ఉద్యమానికి సోవియట్ యూనియన్ అందించిన మద్దతును ఆయన గుర్తుచేసుకున్నారు.
ఇటీవల కజాన్‌లో జరిగిన 16వ బ్రిక్స్ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా పుతిన్‌తో సమావేశమయ్యారు. మోదీ నాయకత్వంలో భారత్ సాధిస్తున్న ఆర్థిక విజయాలను పుతిన్ అప్పుడు కూడా ప్రశంసించారు.