న్యూఢిల్లీ: యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ఈ అక్టోబర్‌లో ఆధార్ కార్డును ఏటీఎం కార్డు సైజులో ఉండే పాలి వినైల్ కార్డు రూపంలో భారత పౌరులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. మన పాకెట్లో ఇమిడి పోయే పాన్ కార్డు, డెబిట్, క్రెడిట్ కార్డు సైజులో ఉండటం ఈ ఆధార్ కార్డు ప్రత్యేకత.
తాజాగా యూఐడీఏఐ కొత్త పీవీసీ కార్డును పొందేందుకు కొన్ని వెసులుబాట్లను కల్పించింది. ఈ కార్డును పొందటానికి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌తో పని లేదని, ఓటీపీ పొందడం కోసం ఏ మొబైల్ నెంబర్‌నైనా వాడవచ్చని తాజాగా ఒక ప్రకటనలో పేర్కొంది. ఓ వ్యక్తి తన కుటుంబం మొత్తానికి పీవీసీ ఆధార్ కార్డులను ఆన్‌లైన్ ద్వారా ఆర్డర్ చేయవచ్చని కూడా తెలిపింది. ఈ కార్డు పొందటానికి మనం రూ.50 చెల్లించాల్సి ఉంటుంది.
మొదటగా యూఐడీఏఐ అధికారిక వెబ్ సైట్ ఓపెన్ చేశాక ‘మై ఆధార్’ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే అక్కడ మీకు అర్డర్ ఆధార్ పీవీసీ కార్డు అనే లింక్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయాలి. మీ ఆధార్ కార్డు యొక్క 12 అంకెల ఆధార్ నెంబర్ నమోదు చేసి, సెక్యూరిటీ క్యాప్చా ఎంటర్ చేసి ఓటీపీపై క్లిక్ చేస్తే మీకు ఆధార్ కార్డు లింకు చేయబడిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేశాక అది పేమెంట్ గేట్ వే లోకి వెళ్తుంది.
అక్కడ ఇంటర్ నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ద్వారా 50 రూపాయలు చెల్లిస్తే, మీ కొత్త పీవీసీ ఆధార్ కార్డు స్పీడ్ పోస్ట్‌లో కొన్ని రోజుల్లో మీ ఇంటికే వస్తుంది. క్యూ ఆర్ కోడ్ కూడా ఉన్న ఈ ఆకర్షణీయమైన కార్డును ఆన్ లైన్లో అప్లై చేసుకోవచ్చు లేదా ఈ సేవా కేంద్రాల్లో అయినా ఈ కార్డును పొందవచ్చు.
మీరు ఈ ఆధార్ కార్డు స్టేటస్ కూడా ట్రాక్ చేయచ్చు. యూఐడీఏఐ వెబ్ సైట్లో ట్రాకింగ్ ఆప్షన్ కూడా ఉంది. ‘మై ఆధార్’ అని క్లిక్ చేసి, ‘చెక్ ఆధార్ పీవీసీ కార్డ్ స్టేటస్’ అని ఎంచుకుంటే మీ ఆధార్ మీ చేతుల్లోకి వచ్చేందుకు ఎంత సమయం పడుతుందో తెలుసుకోవచ్చు.