అంతర్జాతీయం: అమెరికా చేతిలో వేలాది టెలిగ్రామ్ డేటా గోప్యత భద్రతపై ప్రశ్నలు
గోప్యతకు ప్రాధాన్యత ఇచ్చే ప్రముఖ మెసేజింగ్ యాప్ ‘టెలిగ్రామ్’ నుంచి అమెరికా ప్రభుత్వం యూజర్ల డేటాను సేకరించినట్లు తెలుస్తోంది. ఈ వివరాలను టెలిగ్రామ్ తన తాజా పారదర్శక నివేదిక ద్వారా వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం, 2023లో అమెరికా ప్రభుత్వం 900 రిక్వెస్టులు పెట్టి, 2,253 మంది యూజర్ల డేటాను సేకరించింది.
2024 ఆగస్టులో టెలిగ్రామ్ సీఈవో పావెల్ దురోవ్ ఫ్రాన్స్‌లో అరెస్టైన తర్వాత డేటా సేకరణకు సంబంధించి ప్రభుత్వ రిక్వెస్టుల సంఖ్య గణనీయంగా పెరిగింది. హవాలా మోసాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, చిన్నారులపై లైంగిక దోపిడీ వంటి ఆరోపణలతో దురోవ్‌ను ఫ్రాన్స్ అధికారులు అరెస్టు చేశారు. దీనికి స్పందనగా టెలిగ్రామ్ తన గోప్యతా విధానంలో మార్పులు చేసింది.
మార్పుల ప్రకారం, ప్రభుత్వ అధికారిక అభ్యర్థనలపై నిర్దిష్ట సమాచారాన్ని, ఐపీ అడ్రస్, ఫోన్ నంబర్ వంటి డేటాను ప్రభుత్వానికి అందజేయాలని టెలిగ్రామ్ నిర్ణయించింది. అయితే, ఈ విధాన మార్పులతో యూజర్లలో అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. తమ వ్యక్తిగత సమాచారంపై ప్రభుత్వం గమనించుతుందా? సోషల్ మీడియా వేదికల్లో వ్యక్తిగత వివరాలను ఉంచడం భద్రమేనా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
పారదర్శక నివేదికలో పేర్కొన్న ప్రకారం, టెలిగ్రామ్ గత ఏడాది తొలి 9 నెలల్లో కేవలం 14 రిక్వెస్టులకే స్పందించినప్పటికీ, దురోవ్ అరెస్టు తర్వాత ఈ సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. దీంతో టెలిగ్రామ్ గోప్యతా విధానంపై వినియోగదారులు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. డేటా సేకరణను డిజిటల్ గోప్యతకు సవాలుగా అభివర్ణిస్తూ, ప్రభుత్వ డిమాండ్లకు ప్రైవేటు సంస్థలు ఎలా స్పందించాలో అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.