స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా మాజీ క్రికెటర్, కోచ్ రాహుల్ ద్రవిడ్ గాయపడ్డాడు. తన కొడుకు అన్వయ్‌తో క్రికెట్ ఆడుతుండగా వికెట్ల మధ్య పరుగులు తీసే క్రమంలో కాలికి గాయమైంది. దాంతో, నొప్పి ఎక్కువ కావడంతో ఆట మధ్యలోనే డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయాడు.
బెంగళూరులోని విజయ క్రికెట్ క్లబ్ తరఫున సెమీఫైనల్ మ్యాచ్ ఆడుతున్న ద్రవిడ్, 28 బంతుల్లో 29 పరుగులు చేశాడు. అయితే, గాయం కారణంగా అతడు బరిలో కొనసాగలేకపోయాడు. ప్రస్తుతం కాలికి బ్యాండేజీ వేసుకొని చేతికర్రల సహాయంతో నడుస్తున్న ద్రవిడ్‌ను చూసి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
త్వరలో ప్రారంభమయ్యే ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వహించాల్సిన ద్రవిడ్, జైపూర్ క్యాంప్‌కు హాజరయ్యాడు. అయితే, అతని గాయం కోలుకునే వరకు ఎలాంటి వ్యాయామాలు, కఠినమైన శిక్షణలు తీసుకోకూడదని వైద్యులు సూచించారు.
రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ ఇప్పటి వరకు ద్రవిడ్ గాయం గురించి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ, అభిమానులు అతను త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో సందేశాలు పంపుతున్నారు.