అంతర్జాతీయం: అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రవాస భారతీయులతో జరిగిన సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం అని పేర్కొన్న రాహుల్, భాషలు, సంప్రదాయాల పేరిట ఎవరినీ వేరుగా చూడరాదని అన్నారు. ముఖ్యంగా తెలుగు భాష గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించడం విశేషం.
“భారత జాతీయ గీతం దేశంలోని అన్ని రాష్ట్రాలను సమానంగా చూపిస్తుంది. ఒక రాష్ట్రం బెస్ట్, మరొకటి సెకండ్ బెస్ట్ అని కాదు. అంతేగాక, భాషల విషయంలో కూడా ఎవరినీ తక్కువగా చూడరాదు. హిందీ మాట్లాడేవారు మాత్రమే ఇష్టమని, తమిళం లేదా తెలుగు మాట్లాడేవారు సరిగా లేరని భావించడం సరికాదు” అని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.
తెలుగు భాష – ఒక చరిత్ర, ఒక సంప్రదాయం
తెలుగు భాష గురించి మాట్లాడుతూ, “తెలుగు కేవలం ఒక భాష కాదు. ఇది ఒక చరిత్ర, సంప్రదాయం, సంస్కృతి. మీరు తెలుగు భాష అంత ముఖ్యమే కాదని అంటే, ఆ ప్రాంత ప్రజలను మీరు అవమానిస్తున్నట్లే. అలా పోల్చడం వలన వారి సంప్రదాయం, పూర్వీకులు తక్కువ అని అనుకోవడం సరైనది కాదు” అని రాహుల్ పేర్కొన్నారు.
ఇలాంటి తేడాలు కొందరు అర్థం చేసుకోలేకపోవడం వల్లే దేశంలో అనవసర పోరాటాలు జరుగుతున్నాయని ఆయన విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంలోనే భాజపా (BJP)పై విమర్శలు చేస్తూ, వారు ఒకే భావజాలాన్ని దేశం మీద రుద్దాలని చూస్తున్నారని, తాము మాత్రం భిన్న భావజాలాల కేంద్రంగా ఉన్నామని రాహుల్ పేర్కొన్నారు.
భారత్‌లో నిరుద్యోగ సమస్య – చైనాతో పోలిక
రాహుల్ గాంధీ తన ప్రసంగంలో భారతదేశంలో నిరుద్యోగం ప్రధాన సమస్యగా ఉందని ప్రస్తావించారు. ప్రపంచంలోని కొన్ని ఇతర దేశాల్లో ఈ సమస్య లేదు అని వివరించారు. “చైనా, వియత్నాం లాంటి దేశాలు నిరుద్యోగాన్ని అధిగమించాయి. ఒకప్పుడు ప్రపంచ ఉత్పత్తి కేంద్రం అమెరికా ఉండగా, ఇప్పుడు అది మారిపోయింది. అమెరికాలో తయారు అయ్యే వస్తువులు ఇప్పుడు కొరియా, జపాన్, చైనా లాంటి దేశాలకు వెళ్లిపోయాయి. ప్రపంచ ఉత్పత్తిలో చైనా చాలా ముందుకు దూసుకెళ్లింది” అని రాహుల్ వ్యాఖ్యానించారు.