ఢిల్లీ: ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గౌతమ్ అదానీని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అమెరికాలో అదానీపై అవినీతి ఆరోపణలతో కేసు నమోదైన నేపథ్యంలో, ఈ అంశం భారత రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రాహుల్ గాంధీ ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ, అదానీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అదానీ మోదీ బంధం వల్లే ఈ లంచం ఆరోపణలు బయటకు రాలేదని, ఇది దేశ చట్టాలపై అవమానం కాదా అని ప్రశ్నించారు. అదానీ దేశాన్ని భారీగా ఆర్థికంగా దోచుకున్నారని, ఆయన్ని కాపాడుతున్న సెబి చీఫ్ మాధభి పురి బచ్‌పై కూడా విచారణ జరగాలని డిమాండ్ చేశారు.
అదానీపై వెంటనే జేపీసీ ఆధ్వర్యంలో విచారణ జరిపించాలని శీతాకాల సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతామని స్పష్టం చేశారు.
అమెరికాలో నమోదైన కేసులో, అదానీ మరో ఏడుగురు భాగస్వాములతో కలిసి సోలార్ ప్రాజెక్టు దక్కించుకునేందుకు రూ.2,000 కోట్ల లంచం ఆఫర్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు.
ఇదే విషయంపై బ్రూక్లిన్ ఫెడరల్ కోర్టు అభియోగాలు నమోదు చేసింది. ఈ కేసు ప్రభావంతో అదానీ గ్రూప్ షేర్లు భారీ పతనాన్ని చవిచూశాయి.
రాహుల్ గాంధీ మాట్లాడుతూ, “మోదీ ప్రభుత్వం నిష్పక్షపాతంగా ఉండాలంటే, అదానీ అరెస్టు తప్పనిసరి” అన్నారు. అమెరికా అభియోగాలపై భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.