ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ మహా కుంభమేళాపై చేసిన వ్యాఖ్యలకు తాను మద్దతు తెలుపుతున్నానని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తెలిపారు. అయితే, కుంభమేళాలో తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధాని నివాళి అర్పించలేదని విమర్శించారు.
కుంభమేళాకు వచ్చిన యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని, వారికి ప్రధాని పరిష్కారం చెప్పాలని రాహుల్ అన్నారు.
ప్రధాని ప్రసంగం అనంతరం, ప్రతిపక్ష నేతలకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. సభలో విపక్షాలకు తగిన స్థానం దక్కడం లేదని ఆరోపించారు. పార్లమెంటరీ విధానాల ప్రకారం, ప్రతిపక్ష నాయకుని గళాన్ని వినిపించనివ్వాలని అన్నారు.
రాహుల్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ స్పందించారు. ప్రధానమంత్రి లేదా మంత్రులు మాట్లాడుతుంటే ఇతర సభ్యులకు అనుమతి ఉండదని అన్నారు. కానీ రాహుల్ గాంధీ ఈ నిబంధనలను అర్థం చేసుకోకపోవడం విచిత్రమని ఎద్దేవా చేశారు.