ఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం సాధిస్తుండటంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ ఆయన సోషల్ మీడియాలో సెటైర్ వేశారు.
“మరోసారి బీజేపీని గెలిపించినందుకు రాహుల్ గాంధీకి అభినందనలు” అంటూ కేటీఆర్ తన ట్వీట్‌లో వ్యాఖ్యానించారు. దీనికి తోడు, గతంలో తాను మీడియా ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యల వీడియోను కూడా జతచేశారు.
ఆ వీడియోలో “దేశంలో మోదీకి నమ్మకమైన కార్యకర్త ఎవరైనా ఉన్నారంటే అది రాహుల్ గాంధీనే” అంటూ కేటీఆర్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. బీజేపీని అడ్డుకోవడం రాహుల్ వల్ల కాదని తాను చాలా రోజుల నుంచే చెబుతున్నానని, ఇప్పుడు ఫలితాలు కూడా అదే విషయాన్ని నిరూపిస్తున్నాయని తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీ ఫలితాల్లో బీజేపీ 42 స్థానాల్లో ముందంజలో ఉంది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ 27 స్థానాల్లో మాత్రమే లీడ్‌లో ఉంది. కాంగ్రెస్ మాత్రం పూర్తిగా నిరాశపరిచింది. ఈ ఎన్నికల్లో కనీసం ఒక్క స్థానమైనా గెలుస్తుందా? అనే అనుమానాలు కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.
కేటీఆర్ రాహుల్ గాంధీపై ఈ విధంగా సెటైర్లు వేసిన తీరు రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఆయన వ్యాఖ్యలు బీజేపీ వర్గాల్లో హర్షం వ్యక్తం చేయగా, కాంగ్రెస్ వర్గాల్లో మాత్రం మిశ్రమ స్పందన లభిస్తోంది.