హైదరాబాద్: గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో జరిగిన సంవిధాన్ సమ్మాన్ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే రిజర్వేషన్ల పై ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తివేయనున్నట్టు వెల్లడించారు.
బుధవారం నుంచి తెలంగాణలో కుల గణన ప్రారంభమవుతున్న నేపథ్యంలో, ఈ గణన సమాజంలో వివక్షను తొలగించడానికి ముఖ్యమైనదని చెప్పారు.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా దేశవ్యాప్తంగా కుల వివక్షను చూసిన అనుభవాన్ని పంచుకున్నారు. రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేయడం ద్వారా కుల వివక్షకు బలమైన గండికొట్టాలని తెలిపారు.
ముఖ్యంగా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, గిరిజన వర్గాల్లో ప్రతిభ ఉన్న వారు సరిగా ప్రాతినిధ్యం పొందకపోవడం బాధకరం అని చెప్పారు.
రాహుల్ గాంధీ ప్రకటనకు తోడు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కుల గణన చేపడుతున్నామని, ఈ గణన కులాల సామాజిక స్థితిగతులను అంచనా వేసి, వారికి మెరుగైన జీవన పరిస్థితులను కల్పించడం లక్ష్యమని చెప్పారు. తెలంగాణలో కుల గణన అత్యవసరం అని, దీని ద్వారానే సమాజంలో సుసమానత సాధ్యమని అభిప్రాయపడ్డారు.