జాతీయం: భారతీయ సంస్కృతి పరిరక్షణలో సిక్కుల కీలక పాత్రను దేశం గౌరవిస్తుండగా, వారి గురించి తప్పుడు వ్యాఖ్యలు చేయడం రాహుల్ గాంధీకి సరీకాదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సూచించారు.
ఇటీవల రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలో భాగంగా వర్జీనియాలో సిక్కుల గురించి చేసిన వ్యాఖ్యలను రాజ్‌నాథ్ తీవ్రంగా విమర్శించారు. రాహుల్ వ్యాఖ్యలు నిరాధారమని, సిగ్గుచేటుగా భావిస్తున్నట్లు తెలిపారు.
సిక్కులపై రాహుల్ వ్యాఖ్యలు
రాహుల్ గాంధీ సిక్కులకు గురుద్వారాలలో తలపాగాలు ధరించేందుకు అనుమతించడంలేదని చెప్పడం పూర్తిగా అవాస్తవమని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. సిక్కు సమాజం భారతీయ సంస్కృతి పరిరక్షణలో కీలకమైన పాత్ర పోషిస్తోందని, వారి గురించి తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని హితవు పలికారు.
రిజర్వేషన్లపై రాహుల్ వ్యాఖ్యలు
రాహుల్ గాంధీ రిజర్వేషన్లను రద్దు చేస్తామని చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. ఎన్డీయే ప్రభుత్వం దళితులు, వెనుకబడిన తరగతులు, గిరిజనుల సంక్షేమం కోసం రిజర్వేషన్ విధానాన్ని బలోపేతం చేసిందని ఆయన వివరించారు. రిజర్వేషన్లపై మోసపూరిత వ్యాఖ్యలు చేసి ప్రజలను తప్పుదారి పట్టించడం సరి కాదని అన్నారు.
భారత్-చైనా సరిహద్దు వివాదం
అమెరికాలో ఇండియా-చైనా సరిహద్దు వివాదంపై రాహుల్ చేసిన వ్యాఖ్యలు వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయని రాజ్‌నాథ్ విమర్శించారు. రాహుల్ చెప్పే “మొహబ్బత్ కీ దుకాణ్” ప్రేమను ప్రదర్శించే ప్రతినిధిగా ఉంటే, ఆయన ఇప్పుడు “అబద్ధాల దుకాణం” తెరిచారని వ్యంగ్యంగా అన్నారు.
రాహుల్‌కి హితవు
విపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు మానుకోవాలని, అవాస్తవాల ప్రచారం చేయకుండా సంయమనం పాటించాలని రాజ్‌నాథ్ సింగ్ హితవు పలికారు.