జాతీయం: యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లపై ఇక కాసుల వర్షం..!
ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ క్రియేటర్లకు సరికొత్త అవకాశాలను అందించేందుకు ముందుకు వచ్చింది. క్రియేటర్ల ఆదాయాన్ని మరింత పెంచేందుకు యూట్యూబ్ తాజాగా ‘షాపింగ్ అఫిలియేట్ ప్రోగ్రామ్’ అనే కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా కంటెంట్ క్రియేటర్లు తమ వీడియోల్లో ప్రొడక్ట్స్‌ను ట్యాగ్ చేయడం ద్వారా మంచి రెవెన్యూను సంపాదించుకోవచ్చు.
మింత్రా, ఫ్లిప్‌కార్ట్‌తో భాగస్వామ్యం
ఈ కొత్త ఫీచర్‌కు సంబంధించి యూట్యూబ్ మింత్రా, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. కంటెంట్ క్రియేటర్లు యూట్యూబ్ షాపింగ్ అఫిలియేట్ ప్రోగ్రామ్‌లో సైన్ అప్ చేయడం ద్వారా తమ వీడియోలు, షార్ట్ వీడియోలు, లైవ్‌స్ట్రీమ్‌లు వంటి కంటెంట్‌లో వివిధ ఉత్పత్తులను ట్యాగ్ చేయవచ్చు.
క్రియేటర్లకు కమిషన్ ఆదాయం ఎలా?
ఈ ఫీచర్‌తో క్రియేటర్లు ప్రొమోట్ చేసిన ప్రొడక్ట్స్‌ను వినియోగదారులు కొనుగోలు చేస్తే క్రియేటర్లకు కమిషన్ రూపంలో ఆదాయం లభిస్తుంది. ఒక వీడియోలో గరిష్టంగా 30 ఉత్పత్తుల వరకు ట్యాగ్ చేసుకునే అవకాశం ఉంది. ఉత్పత్తిని ట్యాగ్ చేసే సమయంలోనే ప్రతి ప్రొడక్ట్‌పై లభించే కమిషన్ వివరాలను కూడా తెలుసుకోవచ్చు.
ఎవరికీ ఈ ఫీచర్?
ఈ ప్రోగ్రామ్‌లో భాగస్వామ్యం ఉన్న కంటెంట్ క్రియేటర్లకు మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. అంటే కనీసం 10,000 సబ్‌స్క్రైబర్ల సంఖ్య కలిగిన చానల్స్‌కు మాత్రమే ఈ అవకాశాన్ని యూట్యూబ్ కల్పించింది. పిల్లల కోసం కంటెంట్ చానల్స్ నడుపుతున్న వాళ్లకు, మ్యూజిక్ చానల్స్‌కి ఈ ఫీచర్ అందుబాటులో ఉండదు.
షాపింగ్ సింబల్‌తోనే పూర్తి సమాచారం
క్రియేటర్లు ట్యాగ్ చేసిన ప్రొడక్ట్స్‌కు సంబంధించిన వివరాలను వినియోగదారులు షాపింగ్ సింబల్‌పై క్లిక్ చేసి చూసుకోవచ్చు. ఇది కేవలం యూట్యూబ్‌లోనే అందుబాటులో ఉంటుంది, వేరే బ్రౌజర్ పేజీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడే వారికి నచ్చిన ప్రొడక్ట్స్‌ను పిన్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది.