మూవీ డెస్క్: రౌద్రం రణం రుధిరం(ఆర్‌ఆర్‌ఆర్)
ప్రధాన తారాగణం: జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్,అజయ్ దేవ్‌గణ్, ఆలియా భట్, శ్రియా శరణ్, ఒలివియో మోరీస్, రే స్టీవెన్ సన్, అలిసన్ డూడీ, రాజీవ్ కనకాల, రాహుల్ రామకృష్ణ తదితరులు.
రాజమౌళి, రాం చరన్, జూనియర్ ఎన్టీఆర్ మరియు యావత్ సినీ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం రౌద్రం, రణం, రుధిరం.. (ఆర్‌ఆర్‌ఆర్). బాహుబలి లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన తరువాత రాజమౌళి దర్శకత్వం వహించిన చిత్రం ఇదే కావడం, అదే విధంగా ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీస్టారర్ గా తెరకెక్కడంతో ఆర్‌ఆర్‌ఆర్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ చిత్ర కథ మొత్తం 1920 ప్రాంతంలో జరుగుతుంది. అప్పటి బ్రిటీష్ ప్రభుత్వంలో విశాఖపట్నానికి చెందిన రామరాజు(రామ్ చరణ్) పోలీసు అధికారిగా పని చేస్తుంటాడు. పదోన్నతి కోసం పై అధికారుల ఆదేశాలనుగుణంగా పని చేస్తుంటాడు. మరదలు సీత(ఆలియా భట్), గ్రామస్తులకు ఇచ్చిన మాట నెరవేరాలంటే.. ఆయన పదోన్నతి పొందాల్సిందే.
అదే సమయంలో గవర్నర్ స్కాట్(రే స్టీవెన్ సన్) ఒక సారి ఫ్యామిలీతో కలిసి ఆదిలాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు, అక్కడ గోండు జాతికి చెందిన బాలిక మల్లిని తమతో పాటు ఢిల్లీకి తీసుకెళ్తాడు. తమ బిడ్డని తీసుకెళ్లొద్దని అడ్డుకున్న కుటుంబ సభ్యులపై దాడి చేయిస్తాడు. ఇది అన్యాయం అని భావించిన గోండు జాతి బిడ్డ భీమ్ (ఎన్టీఆర్) ఎలాగైన మల్లిని తిరిగి తీసుకురావాలని భావిస్తాడు.
తన స్నేహితులతో కలిసి ఢిల్లీకి వెళ్తాడు. పకడ్బందీ బందోబస్తు ఉన్న బ్రిటీష్ కోటలోకి భీమ్ ఎలా వెళ్లగలిగాడు? అక్కడే పోలీసు అధికారిగా ఉన్న రామరాజు, ఎన్టీఆర్ ఎలా స్నేహితులు అయ్యారు? ప్రాణ స్నేహితులుగా ఉన్న వీరిద్దరు ఒకరిపై ఒకరు ఎందుకు దాడి చేసుకున్నారు? అసలు రామరాజు తన మరదలు, గ్రామస్తులకు ఇచ్చిన మాట ఏంటి? అతని నేపథ్యం ఏంటి? శక్తిమంతులైన ఈ ఇద్దరు కలిసి బ్రిటీష్ ప్రభుత్వాన్ని ఎలా గడగడలాడించారు?అనేదే మిగతా కథ.
ఇక నటన విషయానికొస్తే మల్టీస్టారర్స్ రాం చరన్, ఎన్టీఆర్ ఒకరితో ఒకరు పోటీ పడి నటించారు. తమ పాత్రలకు న్యాయం చేయడానికి వీరిద్దరితో పాటు మిగతా తారాగణం కూడా ఎంత కష్టపడ్డారనేది తెర పై స్పష్టంగా కనిపిస్తుంది.
ఇక మొత్తం చిత్రం యొక్క ఫలితం దాదాపుగా హిట్టే అని అన్ని వర్గాల నుండి వినిపిస్తుంది. రాజమౌళి మార్క్ చిత్రంలో ఎన్ని విశేషాలను ప్రేక్షకులు కోరుకుంటారో దాదాపు అన్నీ లభించినట్లే అభిమానులు భావిస్తున్నారు.