టాలీవుడ్: థియేటర్ లు తెరుచుకున్న తర్వాత వరుసగా చిన్న సినిమాలు విడుదల అవుతున్నాయి. తిమ్మరుసు, ఇష్క్, SR కల్యాణమండపం సినిమాలు రెండు వారాల్లో విడుదలయ్యాయి. ఈ వారం విశ్వక్సేన్ పాగల్ సినిమా విడుదల అవనుంది. ఈ రోజు మరో సినిమా విడుదల తేదీ ప్రకటించారు. మొదటి నుండి కథా పరమైన సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న నటుడు శ్రీ విష్ణు. ‘బ్రోచేవారెవరు రా’ సినిమాతో మంచి హిట్ దక్కించుకున్న శ్రీ విష్ణు వరుసగా సినిమాలు చేస్తున్నాడు. శ్రీ విష్ణు హీరో గా నటించిన ‘రాజ రాజ చోర’ సినిమా వచ్చే వారంలో థియేటర్లలో విడుదల అవనున్నట్టు ఈరోజు మేకర్స్ ప్రకటించారు.
ఈ సినిమాలో శ్రీ విష్ణు ఒక దొంగగా నటించనున్నాడు. ఇదివరకే విడుదలైన టీజర్ లో శ్రీ విష్ణు, గంగవ్వ కి మధ్య మంచి కామెడీ ట్రాక్ ఉన్నట్టు తెలుస్తుంది. సినిమా మొత్తం కూడా కామెడీ తో పాటు మంచి ఎమోషనల్ రైడ్ గా ఉండనున్నట్టు టీజర్ లో చూపించారు. పేరుకు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అని చెప్పుకుంటూ దొంగతనాలు చేసే పాత్రలో శ్రీ విష్ణు ఎంటర్టైన్ చేయనున్నాడు. ఈ సినిమాలో శ్రీ విష్ణు కి జోడీ గా మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటిస్తుంది. వివేక్ సాగర్ సంగీతంలో ఈ సినిమా రూపొందింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై టీజీ విశ్వ ప్రసాద్ మరియు అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాని నిర్మించారు. హసిత్ గోలి అనే నూతన దర్శకుడు రూపొందించిన ఈ సినిమా ఆగష్టు 19 న థియేటర్లలో విడుదల అవనుంది.