ముంబై: ఐపీఎల్ 2020లో ‘హ్యాట్రిక్’ విజయాలతో దూసుకెళ్తున్న లక్నో సూపర్‌జెయింట్స్ జోరుకు రాజస్థాన్ రాయల్స్ బ్రేక్ వేసింది. నిన్న జరిగిన ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ 3 పరుగులతో లక్నోపై విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది.
రాజస్థాన్ బ్యాట్స్ మెన్ హెట్‌మైర్ దూకుడుగా ఆడి 36 బంతుల్లో 59 నాటౌట్, 1 ఫోర్లు, 6 సిక్సర్లతో చెలరేగగా, జెయింట్స్ బౌలర్లు హోల్డర్, కృష్ణప్ప గౌతమ్ చెరో 2 వికెట్లు తీసుకున్నారు. చేజింగ్ ప్రారంభించిన లక్నో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు మాత్రమే చేసి తక్కువ స్కోరు మార్జిన్ తో ఓడిపోయింది.
లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్ డికాక్ (32 బంతుల్లో 39; 2 ఫోర్లు, 1 సిక్స్) మెరుగనిపించగా, ఆఖర్లో స్టొయినిస్ (17 బంతుల్లో 38 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) రాయల్స్‌ను కాసేపు వణికించాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ యజువేంద్ర చహల్ (4/41), బౌల్ట్ (2/30) లక్నోను దెబ్బ తీశారు.
రాజస్థాన్ మొదట పది ఓవర్లలో 67/4 చేసి పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయంలో హెట్‌మైర్, అశ్విన్ (28 రిటైర్డ్‌హర్ట్; 2 సిక్సర్లు) ఆటతో జట్టు స్కోరు 16వ ఓవర్లో 100 దాటింది. ఇక మిగిలిన ఓవర్లలో హెట్‌మైర్ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 33 బంతుల్లో (1 ఫోర్, 4 సిక్స్‌లు) అర్ధసెంచరీ సాధించాడు. అతని భారీషాట్లతో రాయల్స్ చివరి 3 ఓవర్లలోనే 50 పరుగులు చేసింది.
లక్నో ఆరంభంలో కోల్పోయిన వికెట్లతో ఉక్కిరిబిక్కిరైంది. బౌల్ట్ తొలి రెండు బంతుల్లో రాహుల్ (0), క్రిష్ణప్ప గౌతమ్ (0) పడగొట్టడం తర్వాత వచ్చిన వారిని చహల్ స్పిన్‌తో కట్టిపడేయడం హోల్డర్ (8), బదోని (5), కృనాల్ పాండ్యా (22) నిర్లక్ష్యం జట్టును ముంచేసింది.
చివరి ఓవర్లో లక్నో గెలుపునకు 15 పరుగులు అవసరమవగా ఆఖరి ఓవర్ వేసిన రాజస్తాన్ బౌలర్ కుల్దీప్ సేన్ వైవిధ్యమైన బంతులతో స్టొయినిస్ ఆటలు సాగనివ్వలేదు. కుల్దీప్ వేసిన తొలి బంతికి అవేశ్ ఖాన్ సింగిల్ తీయగా, తర్వాతి మూడు బంతుల్లో స్టొయినిస్ పరుగు చేయలేకపోయాడు. దాంతో లక్నో విజయ సమీకరణం 2 బంతుల్లో 14 పరుగులుగా మారింది. స్టొయినిస్ ఐదో బంతికి బౌండరీ చివరి బంతికి సిక్స్ బాదినా లక్నోకు ఓటమి తప్పలేదు.