షార్జా: బ్యాట్‌కు బ్యాటే సమాధానం చెప్పింది. భారీ కొండంత లక్ష్యం సిక్సర్ల పిడుగులతో కరిగిపోయింది. ఐపీఎల్ టి20 టోర్నీలో రాజస్తాన్ రాయల్స్ పంజాబ్ కింగ్స్ పై భారీ స్కోరును చేధించి అసాధారణ విజయాన్ని సాధించింది. ఓపెనర్ స్టీవ్ స్మిత్ (27 బంతుల్లో 50; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) భారీ లక్ష్యానికి పునాది వేయగా… ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ సంజూ సామ్సన్ (42 బంతుల్లో 85; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) గెలుపుదారిన మళ్లించాడు.
వీరిద్దరి శ్రమ వృథా అయ్యే సమయంలో రాహుల్ తేవటియా (31 బంతుల్లో 53; 7 సిక్సర్లు) సంచలనాన్ని జతచేశాడు. 224 పరుగుల అసాధ్యామైన స్కోరును సుసాధ్యం చేశాడు. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 20 ఓవర్లలో 2 వికెట్లకు 223 పరుగుల భారీస్కోరు చేసింది. మయాంక్ అగర్వాల్ (50 బంతుల్లో 106; 10 ఫోర్లు, 7 సిక్సర్లు) మెరుపు సెంచరీ బాదగా, కెప్టెన్ రాహుల్ (54 బంతుల్లో 69; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ చేశాడు.
తర్వాత రాజస్తాన్ రాయల్స్ 19.3 ఓవర్లలో 6 వికెట్లకు 226 పరుగులు చేసి నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. రాజస్తాన్ బౌలర్ల పాలిట మయాంక్, లోకేశ్ రాహుల్ బ్యాటింగ్ ‘కింగ్స్’ అయ్యారు. జట్టు స్కోరు 50 పరుగులు చేరేందుకు 27 బంతులే (4.3 ఓవర్లు) అవసరమయ్యాయి. ఇవి వందగా మారేందుకు 53 బంతులే (8.4) సరిపోయాయి. మరో 60 బంతులు (18.5) పడేసరికి ఆ వంద కాస్తా 200 పరుగుల ప్రవాహమైంది. ఈ 20 ఓవర్లలో కేవలం 4 ఓవర్లు మాత్రమే బౌండరీలైను బతికిపోయింది. 16 ఓవర్ల పాటు 31 సార్లు బంతి సిక్స్ లేదా ఫోర్‌గా బౌండారీ దాటింది.
యమ స్పీడ్‌గా ఆడిన స్మిత్ ఔటయ్యాడు. స్పీడ్‌ను కొనసాగించిన సామ్సన్ నిష్క్రమించాడు. క్రీజులో ఉన్న తేవటియా అగచాట్లు పడుతున్నాడు. 17 ఓవర్ల వద్ద రాజస్తాన్ స్కోరు 173/3. మిగిలినవి 18 బంతులే. చేయాల్సినవి 51 పరుగులు. అంటే ఆఖరి 3 ఓవర్లలో 17 పరుగుల చొప్పున చేయాలి. అప్పుడు తేవటియా బ్యాటింగ్ 6, 6, 6, 6, 0, 6 లాంగ్‌లెగ్, బ్యాక్‌వర్డ్ స్క్వేర్ లెగ్, లాంగాఫ్, మిడ్ వికెట్, బంతి గ్యాప్ తర్వాత మళ్లీ మిడ్ వికెట్‌ల మీదుగా మొత్తం 5 సిక్స్‌లు. అంతే సమీకరణం మారింది. రాజస్తాన్ రాయల్స్ విజయం ఫటాఫట్‌గా మారిపోయింది.