చెన్నై: ట్యుటికోరిన్లో జరిగిన లాకప్ డెత్ ఉదంతం పై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. జయరాజ్ , అతని కొడుకు బెనిక్స్ తమిళనాడులోని తూత్తుకుడిలో సెల్ ఫోన్ షాపును నడిపిస్తున్నారు. లాక్ డౌన్ సమయం లో షాపును కరెక్టు సమయంలో మూసేయ లేదంటూ పోలీసులతో జరిగిన వాగ్వాదంతో అరెస్ట్ అయ్యారు. తర్వాత ఇద్దరూ కోవిల్ పట్టి హాస్పిటల్ లో చనిపోయారు. అయితే లాకప్ లో తండ్రీ కొడుకులు మృతి చెందడంపై అంతటా నిరసనలు వెల్లువెత్తాయి. ఘటనకు కారణమైన వాళ్లపై మర్డర్ కేసు పెట్టాలని జయరాజ్ కుటుంబీకులు డిమాండ్ చేశారు. ఈ ఘటనలో ఇప్పటికే ఇద్దరు ఎస్సైలు సహా నలుగురు పోలీసులను అధికారులు సస్పెండ్ చేశారు. కానీ జరగాల్సిన న్యాయం ఇది కాదని వాళ్లకి శిక్ష పడాలని అందరూ కోరుకుంటున్నారు.
ఈ విషయమై తలైవా రజినీకాంత్ ట్విట్టర్ లో తన స్పందన తెలియచేశారు. అందరూ పోలీసులు చేసిన పనికి నిరసనలు తెలియచేస్తున్నా కూడా మేజిస్ట్రేట్ ముందు హాజరు అయిన సస్పెండ్ కాబడిన పోలీసుల బిహేవియర్ వాళ్ళ మాటలు తనను చాలా బాధించాయని రజినీకాంత్ తెలియచేసారు. అలాగే ఈ కేసులో ముడిపడి ఉన్న వాళ్లందరికీ శిక్ష పడాలని ఎవ్వరిని వొదలకూడదని తన ట్విట్టర్ ద్వారా తెలియచేసారు రజినీకాంత్. అలాగే కోపం గా ఉన్న తన ఒక ఫోటో కూడా జత చేసారు. ఈ విషయమై ఇదివరకే చాలా మంది సెలబ్రిటీస్ సోషల్ మీడియా లో స్పందించారు. ముందుగా సింగర్ సుచిత్ర దీనిపై న్యాయం జరగాలి అని ఒక వీడియో పోస్ట్ చేసారు. రజిని కాంత్ షేర్ చేసిన ట్వీట్ ట్రెండింగ్ లో ఉంది.