ఇండియా క్రికెట్ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిన సౌరవ్ గంగూలీ బయోపిక్ పై బిజీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. తాజా సమాచారం మేరకు ఈ పాత్రలో బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావు కనిపించబోతున్నాడు.
విక్రమాదిత్య మోత్వానే దర్శకత్వం వహించే ఈ బయోపిక్ క్రికెట్ కంటే గంగూలీ వ్యక్తిగత జీవితం, కెప్టెన్సీ మలుపులు, బీసీసీఐతో తలెత్తిన వివాదాలపై ఎక్కువ ఫోకస్ పెట్టనుంది.
తాజాగా ‘స్త్రీ 2’లో మెప్పించిన రాజ్‌కుమార్ రావు, గంగూలీ లాంటి మాస్ స్పోర్ట్స్ ఐకాన్ పాత్రకు న్యాయం చేయగలడా? అనే సందేహాలు కూడా కొందరిలో నెలకొన్నాయి.
అయితే రాజ్‌కు విభిన్న పాత్రల్లో నటించడంలో మంచి అనుభవం ఉంది. ఇప్పటికే ట్రైనింగ్ మొదలుపెట్టినట్లు సమాచారం. షూటింగ్ ప్రారంభానికి ముందు స్పెషల్ వర్క్‌షాపులు కూడా ప్లాన్ చేశారని తెలుస్తోంది.
రాజ్ ప్రస్తుతం వామికా గబ్బితో కలిసి నటించిన ‘భూల్ చుక్ మాఫ్’ చిత్రంతో మే 9న థియేటర్లలో రాబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్ తర్వాత గంగూలీ బయోపిక్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
ఈ సినిమా అధికారిక ప్రకటన వెలువడితే, ఇది బాలీవుడ్ క్రికెట్ బయోపిక్స్‌లో మరో బిగ్ హైపుగా మారనుంది.