టాలీవుడ్: వరుస పరాజయాల్లో ఉన్న రాజ్ తరుణ్ ప్రస్తుతం ‘స్టాండ్ అప్ రాహుల్’ అనే కొత్త సినిమాతో రానున్నాడు. లాక్ డౌన్ సమయంలో ఓటీటీ లో ‘ఒరేయ్ బుజ్జిగా’ కొంతగా పరవాలేదనిపించినా, ‘పవర్ ప్లే’ తో మరో సారి పరాజయం మూటకట్టుకున్నాడు. ఈ సారి స్టాండ్ అప్ రాహుల్ అనే కొత్త తరహా కామెడీ చిత్రంతో రానున్నాడు. ఈ సినిమాలో రాజ్ తరుణ్ యాక్టింగ్, లుక్స్ కొత్తగా అనిపిస్తుండడంతో పాటు సినిమా కూడా కొంచెం ఫ్రెష్ నెస్ ఫీల్ కనిపిస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా వర్ష బొల్లమ్మ నటిస్తుంది. ఈ సినిమా టీజర్ విడుదలైంది. స్టాండ్ అప్ కమెడియన్ ప్రొఫెషన్ ఉండే పాత్రని రాజ్ తరుణ్ ఈ సినిమాలో పోషిస్తున్నాడు.
టీజర్ చూస్తుంటే ముందు ఒక కార్పొరేట్ జాబ్ చేసి చాలా విసుగు చెంది ఈ ప్రొఫెషన్ లోకి అడుగుపెట్టే పాత్ర రాజ్ తరుణ్ ది అని అనిపిస్తుంది. మరి తన ప్రొఫెషన్ చేంజ్ చేసుకున్న తర్వాత అందులో సక్సెస్ అవడానికి ఎలాంటి పరిష్టితులు ఫేస్ చేసాడు అనేది కామెడీ గానే కానీ న్యూ ఏజ్ కామెడీ తరహా లో కొత్తగా ఆకట్టుకునే విధంగా అనిపిస్తుంది. ఇంకా ఈ సినిమా టీజర్ లో కనిపించిన వెన్నెల కిషోర్ లుక్ ఆకట్టుకుంది. ఈ సినిమాలో వెన్నెల కిషోర్ స్టీవ్ జాబ్ లుక్ ని పోలి ఉండే వేషధారణతో కామెడీ పండించే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. సాంటో మోహన్ వీరంకి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి ‘కేరాఫ్ కంచరపాలెం‘ సినిమాకి సంగీతం అందించిన స్వీకర్ అగస్తి పని చేయనున్నారు. ఈ సినిమాను నందకుమార్ అబ్బీనేని, భరత్ మాగులూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.