న్యూఢిల్లీ: రాజ్యసభలో సమాజ్‌వాది పార్టీ ఎంపీ జయా బచ్చన్ మరియు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కర్ మధ్య మళ్ళీ తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. సభా ప్రవర్తనలో తలెత్తిన ఈ ఘర్షణ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
వివాదం జరిగింది అప్పుడు, చైర్మన్ ధన్‌కర్ జయా బచ్చన్‌కి ఆమె భర్త అమితాబ్ బచ్చన్ పేరుతో సంభోధించారు. ఈ వ్యాఖ్యపై స్పందించిన జయా బచ్చన్, తనను “జయా అమితాబ్ బచ్చన్” అని పిలవడంలో ఏదో తేడా ఉందని పేర్కొన్నారు. తాను ఒక ఆర్టిస్ట్ అని, శరీర భాషను అర్థం చేసుకోగలని, చైర్మన్ తనను పిలిచిన విధానం, స్వరం అనుచితంగా ఉందని ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. “మీరు నన్ను జయా బచ్చన్ అని పిలిస్తే బాగుండేది” అని జయా అన్నారు.
ఈ వ్యాఖ్యలపై చైర్మన్ జగదీప్ ధన్‌కర్ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, “ఇక చాలు… మీరు ఎవరివైనా కావచ్చు, కానీ సభా మర్యాద పాటించాలి. నటులు డైరెక్టర్ ఆధీనంలో ఉంటారు, మీరు సెలబ్రిటీ కావచ్చు కానీ, మీకే ప్రత్యేక గుర్తింపు ఉందన్న భావనలో ఉండకండి” అని జయా బచ్చన్‌కి ఘాటుగా స్పందించారు. “మేము కూడా తగిన గుర్తింపుతోనే ఈ స్థాయికి వచ్చాము” అంటూ చైర్మన్ ధన్‌కర్ కఠినంగా వ్యాఖ్యానించారు.
ఈ వాగ్వాదం నేపథ్యంలో ప్రతిపక్ష సభ్యులు అసహనంతో వాకౌట్ చేశారు. అనంతరం జయా బచ్చన్ పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. చైర్మన్ ధన్‌కర్ తనతో మాట్లాడిన తీరు తనను అవమానకరంగా ఉందని, ఆయన తనకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
జయా బచ్చన్ మాట్లాడుతూ, “పార్లమెంట్‌లో అన్ని వర్గాల సభ్యులు మాట్లాడుతున్న తీరు గతంలో ఎన్నడూ ఇలా జరగలేదు. ప్రతిపక్ష నేత మాట్లాడేందుకు లేచి నిలబడితే మైక్ ఆఫ్ చేయబడినట్లు” ఆమె ఆరోపించారు.
ఇప్పటికే ఈ ఘర్షణకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది, ప్రజలు ఈ ఘటనపై విస్తృతంగా చర్చిస్తున్నారు.