మూవీడెస్క్: ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న కొణిదెల రామ్ చరణ్ కు మరో అరుదైన గుర్తింపు లభించింది.
ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్, ఇది ఆస్ట్రేలియాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఫిల్మ్ ఫెస్టివల్. ఈ ఫెస్ట్ యొక్క 15వ వార్షికోత్సవానికి ఈ సారి గౌరవ అతిథిగా రాం చరణ్ కు ఆహ్వానం పలికింది.
ఈ సందర్భంగా ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ టీమ్ మాట్లాడుతూ, ఈ ఏడు తాము జరుపుకోనున్న 15వ వార్షికోత్సవ కార్యక్రమంలో చరణ్ పాల్గొనడం మాకు ఒక మరపురాని సంఘటనగా మిగిలిపోతుందని తెలిపారు.
కాగా, వారు ఈ వేడుకల్లో చరణ్ నటించిన ప్రముఖ చిత్రాలను కూడా ప్రదర్శించబోతున్నట్లు తెలిపారు. భారతీయ సినిమాకు చరణ్ చేసిన సేవలను గుర్తించి, ‘భారతీయ కళ మరియు సంస్కృతికి అంబాసిడర్’ బిరుదును ఈ సందర్భంగా ప్రదానం చేయనున్నట్లు తెలిపారు.
ఈ ఆహ్వానం అందుకోవడం పై చరణ్ స్పందిస్తూ, ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ ఆహ్వానం అందడం, దీనిలో తాను భాగస్వామ్యం కావడం తనకు ఎంతో గౌరవంగా ఉందని చెప్పారు.
మన భారత దేశ చలనచిత్ర పరిశ్రమకు ప్రాతినిధ్యం వహించడం, అందు వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖులు, అభిమానులతో కనెక్ట్ కావడం ఎంతో సంతోషాన్నిస్తుందని ఆయన అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇంత గుర్తింపు, ప్రేమ పొందడం తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని రాం చరణ్ అన్నారు.