కడప: తెలుగు సినీ నటుడు రామ్ చరణ్ కడప దర్గాను సందర్శించడంపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయ్యప్ప మాలను ధరిస్తూ దర్గాకు వెళ్లడం హిందూ సంప్రదాయాలను నొప్పించడమేనని కొందరు అభిప్రాయపడ్డారు.
ఈ విమర్శల నేపథ్యంలో చరణ్‌కు ఆధ్యాత్మిక గురువు రాధా మనోహర్ దాస్ మద్దతుగా నిలిచారు. రాధా మనోహర్ దాస్ మాట్లాడుతూ, రామ్ చరణ్ నిజమైన భక్తుడని, శివాలయాలను శుభ్రం చేయడంలో కూడా చరణ్ చొరవ చూపుతారని తెలిపారు.
చరణ్ తన కుమారికి ‘క్లీంకార’ అనే ఆధ్యాత్మిక పేరును పెట్టడం కూడా ఆధ్యాత్మికతకు అతను ఇచ్చే ప్రాధాన్యతను ప్రతిబింబిస్తుందని అన్నారు. విదేశాల్లో కూడా చరణ్ భగవంతుని పట్ల భక్తి చూపించారని, చరణ్ గురించి ఎవరూ తప్పుగా మాట్లాడొద్దని సూచించారు.
చరణ్ భార్య ఉపాసన కూడా ఈ వివాదంపై స్పందించారు. భారతీయతలో ఉన్న భిన్నత్వంలో ఏకత్వాన్ని చరణ్ గౌరవించారని, అన్ని ధర్మాలను సమానంగా ఆదరించడం తాము నమ్మే సత్యమని పేర్కొన్నారు.
ధర్మం అన్నది వ్యక్తిగత విశ్వాసంతోపాటు సమాజాన్ని కలిపే శక్తిగా ఉండాలని ఉపాసన అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు రామ్ చరణ్ పట్ల వస్తున్న విమర్శలకు సమాధానమివ్వగా, అభిమానులు చరణ్ గౌరవానికి మద్దతుగా నిలుస్తున్నారు.
రామ్ చరణ్ అలా చేయడంలో తప్పులేదని, అతని మనసులో ఉన్న ఆధ్యాత్మికతను గౌరవించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.