హైదరాబాద్: జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు తెలంగాణ హైకోర్టు ఇంచార్జి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఇంతవరకు తెలంగాణ చీఫ్ జస్టీ గా పనిచేస్తున్న జస్టిస్ హిమా కోహ్లి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన తరుణంలో, హైకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తి అయిన జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావును ఇంచార్జి న్యాయమూర్తిగా చేస్తూ బాధ్యతలు అప్పగించారు.
ఈ నియామక విషయమై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు 1966లో హైదరాబాద్‌లో జన్మించారు. కాగా ఆయన తండ్రి సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి, ఇండియన్ లా కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఎం.జగన్నాథరావు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ అభ్యసించిన జస్టిస్ రామచంద్రరావు, 1991లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేశారు.
1989లో న్యాయవాదిగా నమోదైన ఆయన ఐఆర్‌డీఏ, ఎస్‌బీహెచ్, డీసీసీబీ, ఎస్‌బీఐ, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, సెబీ తదితర సంస్థలకు అడ్వకేట్‌గా కూడా పనిచేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిగా కూడా సేవలందించారు. ఇక ఉమ్మడి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా 2012లో నియమితులైన జస్టిస్ రామచంద్రరావు 2013 డిసెంబరు 4 నుంచి జడ్జిగా కొనసాగుతున్నారు.