టాలీవుడ్: బాహుబలి తర్వాత రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా లెవెల్ లో రూపొందుతున్న సినిమా RRR . కేవలం మన దగ్గర మాత్రమే కాకుండా సౌత్ లోని అన్ని భాషల్లో మరియు బాలీవుడ్ లో కూడా ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో టాలీవుడ్ టాప్ హీరోస్ రామ్ చరణ్ తేజ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ అల్లూరి సీతారామ రాజు మరియు కొమరం భీం పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా నుండి విడుదలైన టీజర్స్, పోస్టర్స్ సోషల్ మీడియా లో ట్రెండ్ అయ్యాయి. ఈరోజు రామ్ చరణ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాలో రామ్ చరణ్ సీతారామరాజు లుక్ ని విడుదల చేసింది సినిమా టీం.
ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడని తెలుసు కానీ ఇంతకముందు విడుదల చేసిన టీజర్ లో పోలీస్ గెటప్ లో చూపించింది సినిమా టీం. ఈ పోస్టర్ లో రామరాజు పాత్రలో రామ్ చరణ్ లుక్ విడుదల చేసింది. ధైర్యం, తెగింపు, నిజాయితీ అన్నీ కలగలిపిన సీతారామరాజు అంటూ ఫైర్ బ్యాక్ డ్రాప్ లో విల్లు ఎక్కు పెట్టి చూస్తున్న సీతారామరాజు లుక్ అదిరిపోయింది అని చెప్పుకోవచ్చు. ప్రేక్షకుల నాడి తెలిసిన రాజమౌళి ఈ సినిమా నుండి విడుదల చేసే ప్రతి పోస్టర్, ప్రతి వీడియో ఆకట్టుకునేలా రూపొందిస్తున్నాడు. డి.వీ.వీ దానయ్య నిర్మాణంలో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా మూవీ సౌత్ ఇండియా భాషలు, హిందీ తో పాటు మరిన్ని భారతీయ భాషల్లో అక్టోబర్ 13 న విడుదలవనుంది.