అమరావతి: కరోనా వైరస్ పేరు చెప్పుకుని విజయవాడ రమేష్ ఆస్పత్రి యాజమాన్యం బాధితుల నుంచి కోట్ల రూపాయలు దోచుకుంది. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) మార్గదర్శకాలను బేఖాతరు చేస్తూ ఇష్టారాజ్యంగా చెలరేగిపోయింది.
రమేష్ ఆసుపత్రి యాజమాన్యం ఆగడాలు: అనుమతులు లేకుండా క్వారంటైన్ కేంద్రాల ఏర్పాటు చేయడం, భద్రతా ప్రమాణాల పట్ల నిర్లక్ష్యం, వైద్య ప్రమాణాల పట్ల అలక్ష్యం, మెరుగైన వైద్యం మాటున భారీ దోపిడీ. ఇలా నిర్లక్ష్యానికి అంతనేది లేకుండా వ్యవహరించింది. విజయవాడ స్వర్ణ ప్యాలెస్ హోటల్‌లో రమేష్ ఆస్పత్రికి చెందిన కోవిడ్ కేర్ సెంటర్‌లో జరిగిన అగ్నిప్రమాదం ఘటనలో పదిమంది మృతికి తప్పంతా ఆస్పత్రి యాజమాన్యానిదేనని కమిటీ తేల్చింది.
ఈ వ్యవహారంపై కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ శివశంకర్ నేతృత్వంలో ఏర్పాటైన ఐదుగురు సభ్యుల కమిటీ శుక్రవారం ప్రభుత్వానికి తమ నివేదికని సమర్పించింది. దీంతో కోవిడ్ కేర్ సెంటర్‌గా రమేష్ ఆస్పత్రి గుర్తింపును రద్దు చేశామని కలెక్టర్ ఇంతియాజ్ వెల్లడించారు. దీంతోపాటు ఆ ఆస్పత్రికి చెందిన నాలుగు కోవిడ్ కేర్ సెంటర్ల అనుమతులు రద్దు చేసి మూసివేయించారు. కరోనాకు వైద్యం చేయొద్దని, పాజిటివ్ రోగులను చేర్చుకోవద్దని ఆస్పత్రి యాజమాన్యాన్ని ఆదేశించారు. ఈ మేరకు జారీ చేసిన ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని కలెక్టర్ స్పష్టం చేశారు.