టాలీవుడ్: దాదాపు 5 నెలలుగా కరోనా వార్తలతో పాటు కరోనా తో పోటీ పడి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వార్తల్లో నిలిచిన వ్యక్తి ఎవరంటే రామ్ గోపాల్ వర్మ అని చెప్పొచ్చు. వివాదాల వెంబడి పడి విలాసం కోసం చూసుకునే వ్యక్తుల్లో ఆర్జీవీ ముందుంటాడు. ఆర్జీవీ పైన ప్రస్తుతం ఒకటి రెండు సినిమాలు విడుదలయ్యాయి, సిరీస్ లు సినిమాలు ఇంకొన్ని షూటింగ్ దశలో ఉన్నాయి. ఒక ఇండివిడ్యుయల్ పర్సనాలిటీ పైన ఒకే భాషలో ఇన్ని సినిమాలు రావడం బహుశా ఇదే మొదటిసారేమో. ఇప్పుడు RGV పర్యవేక్షణలోనే RGV కథతో మరొక సినిమా రాబోతోంది. దీనిని మూడు భాగాలుగా తియ్యబోతున్నారట.
బొమ్మాకు మురళి నిర్మాణం లో, దొర సాయి తేజ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందించబోతుంది. సెప్టెంబర్ నుండి షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఈ సినిమా మూడు భాగాల్లో ఒక్కో భాగం లో ఆర్జీవీ ఒక్కో వయసులో ఉన్న సంఘటనలు ఉంటాయట. మొదటి పార్ట్ ‘రాము’ లో ఆర్జీవీ ఇరవై ఏళ్ళప్పటి జీవితం చూపించబోతున్నారు. ఇందులో ఆర్జీవీ పాత్రలో ఒక కొత్త నటుడు నటించబోతున్నాడు. పార్ట్ 1 లో కాలేజ్ రోజులు, తోలి ప్రేమలు, గ్యాoగ్ ఫైట్స్ తో మొదలయ్యి శివ చేయడానికి ఎలాంటి పన్నాగాలు పన్నాడన్నది అంశంగా రూపొందించబోతున్నారు.
రెండవ పార్ట్ ‘రామ్ గోపాల్ వర్మ‘- ‘అండర్ వరల్డ్ తో ప్రేమాయణం’ లో ఆర్జీవీ బాలీవుడ్ ప్రయాణం చూపించబోతున్నారు. ముంబైలో అమ్మాయిలు, గ్యాంగ్ స్టర్స్ ,అమితాబ్ బచ్చన్ లతో ఉన్న అనుబంధాల గురించి తియ్యబోతున్నారు. మూడవ భాగం ‘RGV’- ‘ఇంటలిజెంట్ ఇడియట్’ – ఇందులో RGV ఫేయిల్యూర్లు , వివాదాలు, దేవుళ్ళ పట్ల, సెక్స్ పట్ల , సమాజం పట్ల తనకున్న విపరీత వైఖరుల గురించి తియ్యబోతున్నారని రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ ద్వారా తెలియచేసారు.