టాలీవుడ్: కరోనా కారణంగా తొమ్మిది నెలలు ఖాళీ గా ఉన్న థియేటర్లు గత నాలుగు నెలలుగా కళ కళ లాడుతున్నాయి. దాదాపు నెలకి ఒక బ్లాక్ బస్టర్ ఒక హిట్ సినిమా అన్నట్టుగా సాగుతుంది. ఈ నెలలో ప్రతీ వారం ఒక హిట్ సినిమా అన్నట్టున్న ప్లాన్ లో మొదటి వారం ‘వకీల్ సాబ్’ తో పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ సాధించాడు. కానీ కరోనా సెకండ్ వేవ్ కేసులు ఘననీయంగా పెరుగుతుండడం తో అంతటా ఆందోళన నెలకొంది. థియేటర్లలో జనాలు మునుపటిలా వస్తారో రారో అన్న ఆందోళనలో అలాగే మళ్ళీ ఎప్పుడు లాక్ డౌన్ పెడ్తారో అన్న సందేహంలో ఈ నెలలో విడుదలవ్వాల్సిన మిగతా సినిమాలు మెల్లగా వాయిదా పడుతున్నాయి.
మొదట నాగ చైతన్య లవ్ స్టోరీ వాయిదా వేశారు, తర్వాత వచ్చే వారం విడుదల కానున్న నాని ‘టక్ జగదీశ్‘ వాయిదా వేశారు. ఇపుడు ఈ కోవలోకి రానా ‘విరాట పర్వం’ కూడా వచ్చి చేరింది. కరోనా కారణంగా ఈ సినిమాని వాయిదా వేయనున్నట్టు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. వేణు ఊడుగుల దర్శకత్వం లో రూపొందిన ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. 90 ల్లో జరిగిన యదార్థ కథ ఆధారంగా నక్సలైట్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రూపొందింది. ఈ మూడు సినిమాలు ఏప్రిల్ లోని మిగతా మూడు వారాల్లో విడుదలై మంచి హిట్లు కొడతాయనున్న తరుణంలో ఇలా వాయిదా పడడం ఇండస్ట్రీ వర్గాలకి కొంత నిరాశ కలిగించింది.