బాలీవుడ్ : బాలీవుడ్ లో తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని సినిమాలు తన దగ్గరికి రావట్లేదని సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు. దీంతో మరికొందరు ప్రముఖులు కూడా తమకు ఎదురైన చేదు అనుభవాల్ని బయట పెడుతున్నారు. ఏ ఆర్ రెహమాన్ తో పాటు స్లమ్‌డాగ్ మిలియనీర్ కి మరో ఆస్కార్ గెలుచుకున్న సౌండ్ ఇంజనీర్ అండ్ ఎడిటర్ రసూల్ పూకుట్టి తన అనుభవాల్ని సోషల్ మీడియా లో షేర్ చేసుకున్నారు. ఆస్కార్అ వార్డు వచ్చిన తరువాత బాలీవుడ్‌లో తనకు ఎవ్వరూ అవకాశాలు ఇవ్వలేదని ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్‌ను ట్యాగ్ చేస్తూ రసూల్ కొన్ని ట్వీట్లు చేశారు.
”శేఖర్ కపూర్ నన్ను కూడా అడగండి. నేను చాలా గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నా. ఆస్కార్ గెలిచిన తరువాత హిందీ భాషలో నాకు ఎవ్వరూ అవకాశాలు ఇవ్వలేదు. కానీ ప్రాంతీయ భాషల వారు నన్ను వదులుకోకుండా పట్టుకున్నారు. కొన్ని నిర్మాణ సంస్థలు నువ్వు మాకు అవసరం లేదంటూ నా మొహం మీదనే చెప్పేశాయి.కలలు కనాలని నాకు శేఖర్ కపూర్ నేర్పించారు. నన్ను నమ్మే వాళ్లు చాలా మంది ఉన్నారు. నా మీద నాకు నమ్మకం ఉంది. నేను సులభంగానే హాలీవుడ్‌కి వెళ్లేవాడిని. కానీ అలా చేయలేదు. ఎందుకంటే భారతీయ సినిమానే నాకు ఆస్కార్ వచ్చేలా చేసింది. అంతేకాదు నేను ఆరు సార్లు మోషన్ పిక్చర్ సౌండ్ ఎడిటర్స్‌కి నామినేట్ అయ్యి గెలిచాను. అవన్నీ ఇక్కడ పనిచేసినందుకు నేను గెలుచుకున్నవే. ఎక్కడైనా మనలను పడేసేందుకు చాలా మంది ప్రయత్నిస్తుంటారు. కానీ నేను నమ్మిన వారిపై నాకు చాలా నమ్మకం ఉంది. ఈ విషయాన్ని నా అకాడమీ మెంబర్లు, స్నేహితులతో కూడా పంచుకున్నా. అప్పుడు వారు ఆస్కార్ రావడం వలన శాపం అని అన్నారు. ఇది ప్రతి ఒక్కరు ఎదుర్కొంటారు. నిన్ను కొందరు వ్యతిరేకిస్తున్నారు అంటే నీ స్థాయి పెరిగినట్లు” అని తన మనోగతాన్ని షేర్ చేశారు.
చివరగా ఇవన్నీ ఎవరి పైన దురుద్దేశం తో పెట్టలేదని, తాను నేపాటిజమ్ డిస్కషన్ ని కూడా ఇష్టపడట్లేదని అలాగే తనని సినిమాలకి తీసుకోనందుకు నేను ఎవరినీ నిందించట్లేదని చెప్పారు. ఆస్కార్ శాపం అయిపోయిందని ఆ స్టేజి నుండి ముందుకు వెళ్లానని ట్వీట్ చేసారు.