గుంటూరు: ఆంధ్రప్రదేశ్ లో ఇంటింటికీ రేషన్ సరకులు డోర్ డెలివరీకి రంగం సిద్ధమవుతోంది. 2021 కొత్త సంవత్సరం నుంచి సరికొత్తగా ప్రభుత్వం రేషన్ సరకులను మినీ వ్యాన్ ద్వారా లబ్ధిదారు ఇంటి ముంగిటకే సరఫరా చేయనున్నట్టు ప్రకటించింది. అందుకు అవసరమైన మినీ వ్యాన్లు సిద్ధం చేస్తోంది.
ఆ వ్యాన్లు నడిపేందుకు డ్రైవర్లను కూడా త్వరలో నియామకం చేయనుంది. జిల్లాకు తొలి విడతగా 120 మినీ వ్యాన్లు జైపూర్ నుంచి గూడ్స్ రైలు ద్వారా మంగళవారం న్యూగుంటూరు రైల్వేస్టేషన్‌కు చేరుకున్నాయి.
అయితే, జనవరి ఒకటి నుంచి ఇంటింటికీ రేషన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఇందుకవసరమైన మినీ ట్రక్కులను అన్ని వర్గాల యువతకు మంజూరు చేసి ఉపాధి కల్పించనుంది. ఈ ట్రక్కులను రాయితీపై అందజేయనుంది.
జిల్లాలో 817 మినీ ట్రక్కులు (వ్యాన్లు) అవసరమని జిల్లా అధికారులు గుర్తించారు. ఇందుకు అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. మినీ ట్రక్కుల కోసం అనూహ్య స్పందన లభించింది. ఈ 817 మినీ ట్రక్కులకు 8,179 మంది దరఖాస్తు చేశారు. అంటే ఒక్కో ట్రక్కుకు సగటున పది చొప్పున పది రెట్టు అధికంగా వచ్చాయన్నమాట!