న్యూఢిల్లీ : చిన్న డెనామినేషన్ అయిన రూ.100, రూ.10, రూ.5 పాత నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రద్దు చేస్తుందంటూ గడచిన కొన్ని రోజులుగా సోహల్ మీడియాలో వైరల్ అవుతున్న పుకార్లపై ఆర్‌బీఐ క్లారిటీ ఇచ్చింది.
ఆర్బీఐ ఈ రోజు ట్విటర్ వేదికగా ఈ పుకార్లపై నివృత్తి చేసింది. ‘‘ రూ.100, రూ.10, రూ.5 పాత నోట్లను త్వరలో చలామణి నుంచి తప్పించనున్నట్లు కొన్ని మీడియాలలో వస్తున్న వార్తలు అవాస్తవం’’ అని తెలియజేసింది. అంతకు క్రితం కేంద్రం కూడా ఈ నోట్ల రద్దుపై స్పందించింది. పాత నోట్ల రద్దు ఊహాగానాలను తప్పుడు నివేదికలుగా కొట్టిపారేసింది.
నిన్న అనగా ఆదివారం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) కూడా ఈ వార్త పై ట్విటర్ పోస్టు ద్వారా క్లారిటీ ఇచ్చింది. అదొక ఫేక్ న్యూస్ అని కొట్టిపారేసింది. కాగా, 2021 మార్చి లేదా ఏప్రిల్ చివరి నాటికి రూ.100, రూ.10, రూ.5 పాత నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉపసంహరించ బోతోందని మీడియాలో వెలువడ్డ వార్తలు ప్రజల్లో తీవ్ర కలకలం రేపాయి.