న్యూఢిల్లీ: ఆర్బీఐ దేశంలో ఆర్థిక సేవలను మరింత విస్తృతం చేయడానికి ఉద్దేశించిన డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను (డీబీయూ) అతి త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది. ఈ సంవత్సరం జూలై నాటికి దేశంలోని 75 జిల్లాల్లో వీటిని ప్రారంభం చేయనుంది.
దేశంలో ఉన్న అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు మరియు 10 ప్రైవేట్ రంగ బ్యాంకులు, ఒక స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ఈ దిశగా ఇప్పటికే కసరత్తు చేస్తున్నట్లు ఆర్‌బీఐ ఒక ప్రకటన ద్వారా తెలిపింది. డీబీయూలకు సంబంధించి సమగ్ర మార్గదర్శకాలను రిజర్వ్ బ్యాంక్ ఏప్రిల్ నెలలో విడుదల చేసింది. ఆర్‌బీఐ ఫిన్‌టెక్ విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అజయ్ కుమార్ చౌదరి సారథ్యంలోని ఒక కమిటీ ద్వారా వీటిని రూపొందించింది.
ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) సీఈవో సునీల్ మెహతా నేతృత్వంలోని వర్కింగ్ గ్రూప్ తోడ్పాటు అందించింది. డీబీయూలను ఏర్పాటు చేయతగిన 75 జిల్లాల జాబితాను కూడా ఈ పాటికే రూపొందించింది. ఆర్‌బీఐ కమిటీ మార్గదర్శకాల ప్రకారం డీబీయూలను బ్యాంకింగ్ అవుట్‌లెట్లుగా పరిగణిస్తారు. ఇవి కనీస డిజిటల్ బ్యాంకింగ్ ఉత్పత్తులు, సేవలు (రుణాలు, డిపాజిట్లకు సంబంధించి) అందించాల్సి ఉంటుంది.