బెంగళూరు: కర్ణాటక ముఖ్య కేంద్రంగా పనిచేసే బ్యాంకుపై ఆర్‌బీఐ కొరడా ఝుళిపించింది. లిక్విడిటీ కొరత ఉన్న నేపథ్యంలో దక్కన్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్ కార్యకలాపాలపై ఆర్‌బీఐ తాజాగా ఆంక్షలు విధించింది. దీని వల్ల ఆ బ్యాంకు ఖాతాదారులు ఆరు నెలల కాలానికి తమ పొదుపు ఖాతా నుండి రూ .1000 కన్నా ఎక్కువగా తీసుకోలేరు.
ఈ బ్యాంకు సీఈవోకు ఆదేశాలు జారీచేసినట్టు శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆర్‌బీఐ తెలిపింది. అయితే దీని బట్టి ఆ బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసినట్లు కాదని, తన ఆర్థిక స్థితి మెరుగుపడే వరకు మాత్రమే ఆంక్షలతో బ్యాంకింగ్ వ్యాపారాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేసింది.
లిక్విడిటీ స్థితిని పరిశీలిలంచిన తరువాత బ్యాంకు ఆంక్షలపై నిర్ణయం తీసుకున్నట్టు ఆర్బీఐ వెల్లడించింది. అన్ని పొదుపు, కరెంట్ లేదా డిపాజిట్స్ ఏదైనా ఇతర ఖాతాల్లోని బ్యాలెన్స్ నుంచి కేవలం 1000 రూపాయలకు మించకుండా ఉపసంహరించుకోవడానికి అనుమతి ఉంటుందని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.
దీనితో పాటు కొత్త రుణాలు ఇవ్వడం, డిపాజిట్లు తీసుకోవడం, ఇతర వ్యాపారంపై కూడా ఆరు నెలలపాటు ఆంక్షలు అమల్లో ఉంటాయి. అయితే షరతులకు లోబడి డిపాజిట్లపై రుణాలు తీసుకోవచ్చని తెలిపింది. 99.58 శాతం డిపాజిటర్లు పూర్తిగా డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డిఐసిజిసి) భీమా పథకం పరిధిలోకి వస్తారని రెగ్యులేటర్ పేర్కొంది.