fbpx
Sunday, November 24, 2024
HomeSportsఢిల్లీ చేతిలో తృటిలో ఓటమి తప్పించుకున్న ఆర్సీబీ

ఢిల్లీ చేతిలో తృటిలో ఓటమి తప్పించుకున్న ఆర్సీబీ

RCB-BEAT-DELHI-CAPITALS-BY-1RUN

అహ్మదాబాద్‌: తీవ్ర ఉత్కంఠభరితమైన మ్యాచ్ లో చివరకు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు విజయం సాధించింది. మంగళవారం ఢిల్లీ తో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ కేవలం ఒక్క పరుగు తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు నమోదు చేశింది.

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఏబీ డివిలియర్స్‌ (42 బంతుల్లో 75 నాటౌట్‌; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) తో చెలరేగి ఆదగా, రజత్‌ పటిదార్‌ (22 బంతుల్లో 31; 2 సిక్స్‌లు) బాగా రాణించాడు. తదుపరి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 4 వికెట్లకు 170 పరుగులు మాత్రమే చేయగలిగింది. రిషభ్‌ పంత్‌ (48 బంతుల్లో 58 నాటౌట్‌; 6 ఫోర్లు), షిమ్రాన్‌ హెట్‌మైర్‌ (25 బంతుల్లో 53 నాటౌట్‌; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ సెంచరీలు సాధించినా విజయ తీరం చేరుకోలేకపోయింది.

ఆర్సీబీకి ఎప్పటిలాగే డివిలియర్స్‌ తన 360 డిగ్రీస్ మెరుపులతో ఆదుకున్నాడు. కాస్త నిలదొక్కుకునే వరకు జాగ్రత్తగా ఆడిన ఏబీ అక్షర్, రబడ ఓవర్లలో ఒక్కో సిక్సర్‌ కొట్టి, చివరి ఓవర్లో పండగ చేసుకున్నాడు. స్టొయినిస్‌ పేలవ బౌలింగ్‌ను సొమ్ము చేసుకుంటూ ఈ ఓవర్లో ఎక్స్‌ట్రా కవర్, షార్ట్‌ ఫైన్‌లెగ్, కవర్స్‌ దిశగా డివిలియర్స్‌ మూడు భారీ సిక్సర్లు బాదాడు.

ఢిల్లీ బ్యాటింగ్ లో శిఖర్‌ ధావన్‌ (6)తో పాటు స్టీవ్‌ స్మిత్‌ (4)లను వెంటవెంటనే అవుట్‌ చేసి ఢిల్లీపై ఆర్‌సీబీ ఒత్తిడి పెంచింది. పృథ్వీ షా (18 బంతుల్లో 21; 3 ఫోర్లు) ఎక్కువ ప్రభావం చూపలేకపోయాడు. ఈ దశలో పంత్, స్టొయినిస్‌ (17 బంతుల్లో 22; 3 ఫోర్లు) కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించారు. అయితే బెంగళూరు బౌలర్లు కట్టడి చేయడంతో స్కోరు వేగంగా సాగలేదు.

20వ ఓవర్లో ఢిల్లీకి 14 పరుగులు కావాల్సిన సమయంలో తీవ్ర ఒత్తిడిలో బౌలింగ్ చేసిన సిరాజ్‌ చక్కటి బంతులతో ఇద్దరు విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసి బెంగళూరును గెలిపించాడు. తొలి నాలుగు బంతుల్లో కేవలం 4 పరుగులు ఇవ్వగా, ఐదో బంతిని పంత్‌ ఫోర్‌ బాదడంతో చివరి బంతికి సిక్స్‌ కొడితే గానీ ఢిల్లీ గెలవలేని పరిస్థితి వచ్చింది. ఆఫ్‌ స్టంప్‌కు దూరంగా సిరాజ్‌ వేసిన బంతిని వెంటాడి పంత్‌ పాయింట్‌ దిశగా ఫోర్‌ కొట్టగలిగినా విజయానికి ఆ 4 పరుగులు సరిపోలేదు. చివరికి ఒక పరుగుతో ఢిల్లీ ఓడిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular