ముంబై: రాయల్ చాలెంజర్స్ పై అధ్బుతమైన విజయం తో బెంగళూరు జట్టు ఐపీఎల్ 2021 సీజన్‌లో తమ జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ముంబై వాంఖెడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి టీం 10 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్‌ను మట్టికరిపించింది. రాజస్థాన్ నిర్దేశించిన 178 పరుగుల ఛేజింగ్‌లో బెంగళూరు ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్ అధ్బుత అజేయ శతకం (52 బంతుల్లో 101 నాటౌట్; 11 ఫోర్లు, 6 సిక్స్‌లు)తో కదం తొక్కగా, కెప్టెన్ విరాట్ కోహ్లి (47 బంతుల్లో 72 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అతడికి సహకరించి మ్యాచ్ గెలిపించారు.
ఈ ఇద్దరి ఆటతో బెంగళూరు కేవలం 16.3 ఓవర్లలోనే ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 181 పరుగులు చేసి అలవోకగా గెలిచింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 177 పరుగులు చేసింది. బెంగళూరు బౌలింగ్లో బౌలర్ సిరాజ్ (3/27) ధాటికి 43/4 తో కష్టాల్లో ఉన్న రాజస్తాన్‌ను శివమ్ దూబే (32 బంతుల్లో 46; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), రాహుల్ తెవాటియా (23 బంతుల్లో 40; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) తమ అధ్బుత పోరాటంతో భారీ స్కోరును అందించారు. హర్షల్ పటేల్ మూడు వికెట్లు తీశాడు.
ఆపసోపాలు పడుతూ రాజస్థాన్ సాధించిన భారీ స్కోరును బెంగళూరు ఓపెనర్లు మాత్రం ఆడుతూ పాడుతూ కొట్టేశారు. రాజస్తాన్ సారథి సామ్సన్ ఇన్నింగ్స్ తొలి ఓవర్‌ను లెగ్ స్పిన్నర్ శ్రేయస్ గోపాల్‌తో వేయించగా, మొదటి మూడు బంతులను ఆచితూచి ఆడిన కోహ్లి నాలుగో బంతిని సిక్సర్ కొట్టి బెంగళూరు స్కోరు బోర్డును తెరిచాడు.
తరువాత పడిక్కల్ మూడు ఓవర్ల వ్యవధిలో ఏకంగా ఐదు ఫోర్లు బాది తన బ్యాటింగ్ సత్తాను ప్రదర్శించాడు. బౌలర్ ఎవరైనా సరే కొడితే సిక్సర్ లేదా ఫోర్ అన్నట్లు పడిక్కల్ ఇన్నింగ్స్ కొనసాగింది. మరో ఎండ్‌లో ఉన్న కోహ్లి, పడిక్కల్‌కే ఎక్కువగా స్ట్రయికింగ్ ఇస్తూ ప్రోత్సహించాడు. ఈ క్రమంలో ఎనిమిదో ఓవర్ మూడో బంతిని ఎక్స్‌ట్రా కవర్ మీదుగా ఫోర్ కొట్టిన పడిక్కల్ 27 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు.
పడిక్కల్ నాటౌట్ గా 52 బంతుల్లోనే 101 పరుగులు చేయగా, మరో వైపు కోహ్లీ 47 బంతుల్లో 72 పరుగులు చేసి తొలి వికెట్ కి అజేయంగా 181 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పి ఘన విజయం సొంతం చేసుకుని పాయింట్ల పట్టికలో మళ్ళీ మొదటి స్థానంలో కొనసాగుతోంది బెంగళూరు.