చెన్నై: ఐపీఎల్ లో బుధవారం బెంగళూరు హైదరాబాద్ మధ్య ఉత్కంఠభరితంగా గా సాగిన పోరులో చివరకు సన్‌రైజర్స్ ఓటమి పాలవగా, విజయ తీరాన్ని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) చేరింది. టాస్ గెలిచి బౌలింగ్ చేసిన హైదరాబాద్ బౌలర్లు ప్రత్యర్థిని తక్కువ పరుగులకే కట్టడి చేసినా, బ్యాటింగ్ వైఫల్యంతో సీజన్‌లో రెండో వరుస పరాజయాన్ని చవి చూసింది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ 6 పరుగుల తేడాతో ఆర్‌సీబీ చేతిలో ఓడింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 పరుగులు మాత్రమే చేయగలిగింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మ్యాక్స్‌వెల్ (41 బంతుల్లో 59; 5 ఫోర్లు, సిక్సర్లు) అధ్బుత ఇన్నింగ్స్ ఆడగా కెప్టెన్ కోహ్లి (29 బంతుల్లో 33; 4 ఫోర్లు) ఆకట్టుకున్నాడు.
హైదరాబాద్ బౌలర్లలో హోల్డర్ (3/30) ముఖ్యమైన వికెట్లు తీయగా, రషీద్ ఖాన్ (2/18) టి20 లో తన విలువేంటో మరోసారి చాటాడు. అనం తరం బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 143 మాత్రమే చేసి మ్యాచ్ ఓడిపోయింది.
కెప్టెన్ వార్నర్ (37 బంతుల్లో 54; 7 ఫోర్లు, సిక్సర్), మనీశ్ పాండే (39 బంతుల్లో 38; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. బెంగళూరు బౌలర్లలో షహబాజ్ అహ్మద్ (3/7), హర్షల్ పటేల్ (2/25), సిరాజ్ (2/25) హైదరాబాద్‌ను దెబ్బతీశారు.
సన్రైజర్స్ గెలవడానికి 24 బంతుల్లో 35 పరుగులు చేయాల్సిన దశలో అసలు ట్విస్ట్ మొదలయింది. 17వ ఓవర్ వేయడానికి వచ్చిన షహబాజ్ అహ్మద్ సాఫీగా సాగుతున్న హైదరాబాద్ ఇన్నింగ్స్‌లో అలజడి రేపాడు. తొలి రెండు బంతులకు అనవసరపు షాట్‌లకు ప్రయత్నించిన బెయిర్‌స్టో (12), మనీశ్ పాండేలను అవుట్ చేయడంతోపాటు, చివరి బంతికి సమద్ (0)ను డకౌట్ చేశాడు.
అంతేకాకుండా ఆ ఓవర్‌లో కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇవ్వడంతో మ్యాచ్ చూసిన ప్రతి ఒక్కరికీ కోల్‌కతా, ముంబై మ్యాచే జ్ఞప్తికి వచ్చింది. హైదరాబాద్ మరో కోల్‌కతా కానుందా అనే ఆలోచన సగటు సన్‌రైజర్స్ అభిమానిలో మెదిలింది. 18వ ఓవర్‌లో శంకర్ (3)ను హర్షల్ పటేల్, 19వ ఓవర్‌లో హోల్డర్ (4)ను సిరాజ్ అవుట్ చేయడంతో హైదరాబాద్ కష్టాల్లో పడింది.
చివరి ఓవర్లో సన్రైజర్స్ గెలుపుకి 16 పరుగులు అవసరం కాగా, హర్షల్ వేసిన ఈ ఓవర్లో రషీద్ (17), భువనేశ్వర్ (2 నాటౌట్) తొలి మూడు బంతులకు 8 పరుగులు సాధించారు. అయితే వరుస బంతుల్లో రషీద్, నదీమ్ (0) అవుట్ కావడంతో రైజర్స్ ఓటమి పాలయ్యింది.