చెన్నై: ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి టైటిల్ కోసం పట్టువదలని విక్రమార్కుడి లా ప్రయత్నిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఈ సీజన్‌లో వరుసగా మూడో విజయం తో హ్యాట్రిక్ సాధించింది. ఇప్పటికే రెండు సార్లు చాంపియన్ అయిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో కోహ్లి జట్టు సమష్టి ఆటతీరుతో అధ్బుత విజయం సాధించింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్‌సీబీ, బ్యాట్స్‌మెన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ (49 బంతుల్లో 78; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) మరియు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఏబీ డివిలియర్స్ (34 బంతుల్లో 76 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) సునామీ సృష్టించగా, తదుపరి వంతులో బౌలర్లు కైల్ జేమీసన్ (3/41), హర్షల్ పటేల్ (2/17), యజువేంద్ర చహల్ (2/34) కోల్‌కతాను మట్టికరిపించారు.
తద్వారా బెంగళూరు జట్టు 38 పరుగుల తేడాతో కోల్‌కతాపై ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసి రాయల్ చాలెంజర్స్ 20 ఓవర్లలో కేవలం 4 వికెట్ల నష్టానికి 204 పరుగుల భారీ స్కోరు చేసింది. కోల్కత్తా భారీ 205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగి 20 ఓవర్లలో 8 వికెట్లకు కేవలం 166 పరుగులు మాత్రమే చేయగలిగింది.
కోల్కత్త వైపు బ్యాటింగ్లో ఆండ్రీ రసెల్ (20 బంతుల్లో 31; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఇయాన్ మోర్గాన్ (23 బంతుల్లో 29; 1 ఫోర్, 2 సిక్స్‌లు), షకీబుల్ హసన్ (25 బంతుల్లో 26; 1 ఫోర్, 1 సిక్స్) తమ జట్టును గెలిపించడం కోసం విఫలయత్నం చేశారు.