చెన్నై: ఐపీఎల్ 2021 లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మొదటి మ్యాచ్ గెలిచి తొలి పంచ్ నమోదు చేసింది. శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఆర్‌సీబీ ముంబై ఇండియన్స్ పై 2 వికెట్ల తేడాతో గెలిచింది. ముందుగా ముంబై 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.
ముంబై వైపు క్రిస్ లిన్ (35 బంతుల్లో 49; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సూర్యకుమార్ యాదవ్ (23 బంతుల్లో 31; 4 ఫోర్లు, 1 సిక్స్), ఇషాన్ కిషన్ (19 బంతుల్లో 28; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఆర్సీబీ తరఫున ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ పొందిన హర్షల్ పటేల్ పదునైన బౌలింగ్ (5/27)తో ముంబై హిట్ బ్యాట్స్మెన్లను కీలక సమయంలో అవుట్ చేశాడు.
తరువాత ఆర్‌సీబీ 20 ఓవర్లలో 8 వికెట్లకు 160 పరుగులు సాధించి మొదటి విజయాన్ని నమోదు చేసింది. మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ (27 బంతుల్లో 48; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), మ్యాక్స్‌వెల్ (28 బంతుల్లో 39; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), కోహ్లి (29 బంతుల్లో 33; 4 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడారు.
35 బంతుల్లో 57 పరుగులు చేయాల్సిన స్థితిలో ఏబీ చెలరేగిపోయాడు. చహర్ ఓవర్లో వరుసగా 4, 6 కొట్టిన ఏబీ, బౌల్ట్ ఓవర్లోనూ మరో ఫోర్, సిక్స్ బాదాడు. బుమ్రా వేసిన 19వ ఓవర్లో 2 ఫోర్లతో 12 పరుగులు రాబట్టడంతో ఆర్‌సీబీ విజయం దాదాపుగా ఖాయమైంది. చివరి ఓవర్లో 7 పరుగులు చేయాల్సి ఉండగా, నాలుగో బంతికి డివిలియర్స్ వెనుదిరిగాడు. అయితే ఆఖరి బంతికి ఉత్కంఠను అధిగమించి హర్షల్ సింగిల్ తీయడంతో జట్టు గెలుపు అందుకుంది.